Thathva Rahasyaprabha
Chapters
దశశ్లోకి మద్దులపల్లి మాణిక్యశాస్త్రిచే రచింపబడిన తత్వరహస్యప్రభ యను తెలుగు టీకా తాత్పర్యసహిత శంకరాచార్య విరచిత దశశ్లోకి ప్రారంభం శ్లో|| శృతిస్మృతి పురాణానామాలయం కరణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం || కరుణాసముద్రుడైన శంకరభగవత్పాదులవారు ఆత్మానాత్మ వివేకములేక తన స్వరూపమును గుర్తింపక అజ్ఞానాంధాకారముచేత దేహేంద్రియములయందు ఆత్మయనే భ్రమనుపొంది అతికష్టమగు జన్మమరణ పరంపరను యెడతెగకుండా పొందుచున్న సకలజీవులను తరింపచేయుటకు పరమానుగ్రహముతో సకల వేదాంతసారమును సంగ్రహముగా భోదించుటకై ఈ దశశ్లోకిని రచించిరి. అవతరిణిక. ప్రపంచంలో జ్ఞాతాజ్ఞేయమని రెండుపదార్థములు ప్రసిద్ధమైయున్నవి. జ్ఞేయమనగా ప్రపంచము. జ్ఞాతయనగా ఆత్మయే. ప్రపంచమనగా ఆనాత్మజ్ఞాతయనగా దృక్. జ్ఞేయమనగా దృశ్యం. జ్ఞాతయనగా ప్రత్యక్. జ్ఞేయమనగా పరాక్ అనికూడా అనుభవజ్ఞులు వ్యవహరింతురు, ప్రపంచం ప్రత్యక్షాది ప్రమాణాములచేత తెలియబడుచునేయున్నదిగాని జ్ఞాతస్వరూపం స్పష్టంగా తెలియుటలేదు. జ్ఞాతను నేను నేనని అందరు తెలుసుకుంటూ వ్యవహరించుచున్నారుకాని నేననే ఆత్మ స్వరూపమేమి? శరీరమా లేక ఇంద్రియములా, భౌతికమా లేక అభౌతికమా యెంతపరిమితికలది, ఏరూపముగానుండునని అతినేర్పరులు కూడా అతిప్రయత్నంచేసినను ఆత్మను అనగా తమను తాము గుర్తింపలేకున్నారు. ప్రాణవియోగకాలమందైనను ఇతర శరీరమునుండి వెళ్ళేటప్పుడైనా ఆత్మ కనిపించునేమోనని ప్రబల ప్రయత్నంతో ఎంత సూక్ష్మ దృష్టితో చూచినను కనబడుటలేదు. యెన్నిచదివినను, యెన్నిచేసినను, యెంతవారైనను గుర్తించలేకున్నారు. తనస్వరూపం తనకు తెలియక పోవడం అతిఆశ్చర్యమైన విషయంకదా. ఈస్థితతిలో శాస్త్రం నీవు బ్రహ్మస్వరూపుడవని తత్వమసియను మహావాక్యం బోధిస్తున్నది. త్వంపదమునకు అర్థం జీవుడు. తత్పదమునకు అర్థం ఈశ్వరుడు. ఈ యిద్దరి స్వరూపం తెలుసుకొనుటయే చాలాకష్టం. ఈ యిద్దరికి యేలక్ష్య స్వరూపంతో ఐక్యమును శాస్త్రము బోధించుచున్నదో అది తెలియుట అతి కష్టం. గనుకనే ఆత్మవిషయములో అనేకమంది అనేకవిధములుగా చెప్పుచున్నారు. నాస్తికులయిన చార్వాకులు నేను మనుష్యుడనని శరీరమునే నేనని వాడుటవలన పృథివీ, జలం, తేజస్సు, వాయువు ఈ నాల్గుభూతముల పరిణామమయిన శరీరమే ఆత్మయని భ్రమించరిరి. అందులో కొందరు నేను చూచుచున్నాను. వింటున్నాను అని అనుభవమువలన ప్రత్యేకం ఇంద్రియమలే ఆత్మయని భ్రమించిరి. మరికొందరు ఇంద్రియములన్నియు కలసి ఆత్మయని భ్రమించిరి. నేను ఆలోచిస్తున్నానని అంటున్నాముగనుక మనస్సే ఆత్మయని కొందరనిరి. నేను బ్రతుకుచున్నానని అన్నందువలన ప్రాణమే ఆత్మయని కొందరనిరి. బౌద్ధులలో యోగాచారులు క్షణికమగు విజ్ఞానమే ఆత్మయని భ్రమించిరి. మాద్యమికులనే బౌద్ధులు శూన్యమే ఆత్మయని చాలా విపరీతమగు భ్రమను పొందిరి. శూన్యమే ఆత్మయనుట చాలా విరుద్ధమైనవిషయం. జైనులు దేహేంద్రియములకంటే ఆత్మవేరుగానున్నదిగాని చిన్నదేహంలో చిన్నదిగా శరీరంనిండా నుండునని, పెద్ద దేహంలో పెద్దదిగాను ఆత్మయుండునని శాస్త్రప్రమాణమునకు అతివిరుద్ధముగా ప్రతిపాదించిరి, ఆత్మ పెరుగుట తరుగుటకూడా యున్నదనికూడా జైనులు అభిప్రాయము. కర్తయు భోక్తయు జడరూపము, వ్యాపకముగా నుండును, ఆత్మయని మధ్యలో జ్ఞానం కలుగుచుండునని వైశేషికులు, తార్కికులు, ప్రాభాకులు చెప్పిరి. జఢమైన బోధరూపమే ఆత్మయని భాట్టులు చెప్పిరి. భోక్తయేగాని, కర్తకాదు. అసంగమయిన జ్ఞానస్వరూపమే ఆత్మయని సాంఖ్యులు, యోగులుకూడా చేప్పిరి. అజ్ఞానముచేతనే కర్తృత్వ భోక్తృత్వములు కల్పతమయినవిగాని (జీవుడు) పరమార్థస్థితిలో నిర్గుణసచ్చిదానందస్వరూపుడేయని యేధర్మములు లేనివాడని అద్వైతవేదాన్తులు చెప్పెదరు. మహామహూలకుకూడా సంశయగ్రస్తమైన ఆత్మస్వరూపమును చెప్పుటకు పదిశ్లోకములను వ్రాసిరి అందువలననే దశశ్లోకియందురు. శ్లో|| నభూమిర్నతోయంనతే జోనవాయుర్మఖం నేంద్రియంవా నతేషాం సమూహః | అనై కాంతికత్వా త్సుషుపై#్త్యక సిద్ధస్తదేకోవ శిష్టశ్శివః కేవలోహం || ప్రతిపదార్థము. అహం =నేను అనగా నేననే అనుభవంలో గోచరించుచున్న ఆత్మయని యర్థము. అట్టి నేను ఏకః= అద్వితీయుడను, రెండవది లేనివాడను, అవశిష్టః= ద్వైతప్రపంచము నశించినను, నాశములేక మిగులువాడను, శివః= పరమ మగళస్వరూపుడను, అనగా పరమానంద బోధస్వరూపుడను, కేవలః= ఏధర్మ లేనివాడను, నిత్యస్వప్రకాశానంద స్వరూపమే నేననే అనుభవములో గోచరించు ఆత్మగాని వేరుగాని వేరుకాదని భవము అద్వైతవేదాంతపక్షమే. మోక్షప్రదముకాని వేరుకాదనికూడా అర్థము. ఈ సిద్ధాన్తమునే పరమత నిరాకరణతో భగవత్పాదులవారు బలపరచుచున్నారు. అహమనే పదమును అన్నిటిలోచేర్చి అన్వయించవలెను. భూమిః=భూమి, అహం= నేను, న= కాను, అనగా నేను భూమిరూపునుకాను. ఇట్లే, తోయం= ఉదకము, అహం= నేను న=కాను నేను జలరూపుడను కానని యర్థము. తేజః=తేజస్సు, అహం=నేను. న= కాను, వాయుః =వాయువు అనుభూతము అహం= నేను, న= కాను, ఖం= ఆకాశము, అహం= నేను, న= కాను, తేషాం= ఆ భూతములయొక్క మమూహః= సముదాయము అహం= నేను, న= కాను. మరియొక విధంగాకూడా అన్వయించవచ్చును. అహం నేను అనే తత్వము, భూమిః= భూమి, న= కాదు. ఇట్లే జలాదులు కూడా కావుగనుక నాకు ప్రపంచమునకు నిజముగా తాదాత్మ్యము లేదని యర్థము. ఎందువలననగా అనైకాంతికత్వాత్, నియతముగా మార్పులేకుండా వుండనివిగనుక. అనగా నశించునవి గనుక (అని అర్థము) అద్వైతమతంలో జ్ఞానరూపముగదా ఆత్మ. అట్టిఅత్మ నియతముగా అన్ని కాలములయందుండుననికదా అద్వైతమతము. అయితే సుషుప్త్యవస్థయందు ఏ జ్ఞనములేదుకదా ఆత్మ నిత్యమేట్లగుననే ప్రశ్నకు సమాధానముగా సుషుపై#్త్యకసిద్ధః అని చెప్పిరి. సుషుపై#్త్యకసిద్ధః, నిద్రలేచినతరువాత నాకేమి తెలియదు సుఖంగా నిద్రపోతనని అనుకుంటున్నాడుగనుక. సుష్యుప్త్యవస్థయందు కూడా ఆత్మ మార్పులేకుండా పున్నాడనియే యర్థము. తాత్పర్య వివరణం. పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఈ నాల్గుభూతముల కలయికవలన దేహాదులు పుట్టునని ఆ నాల్గుభూతముల సముదాయమే ఆత్మయని చార్వాకులు చెప్పెదరు. నేను పృథివిని కాను. జలమునుకాను, తేజస్సుకాను, వాయువునుకాను. అని ఒక్కొక్క భూతం నేను కాదనుటలో అభిప్రయమేమంటే ఓ చార్వాకుడా! నీవు నాల్గుభూతముల కలయకతో నేర్పడిన శరీరమే ఆత్మయంటావు. ఆ నాల్గుభూతములను కలపేవారెవరు? నాల్గుభూతములను కలిపేవాడులేనిది కలయిక సంభవించదుకదా. పంచదార, పిండి, నీళ్ళు మొదలయినవి కలపేవాడులేనిదీ. పిండివంట తయారగునా? అనేక నామానులతో యిల్లు తాయారుచేసి ఇది నాయిల్లని అభిమానించేవాడున్నాడుకదా. అటులనే అనేక భూతములతో శరీరమును తయారుచేసి ఈ శరీరము నాదేననేవాడు శరీరంకంటే వేరుగా నుండవలెనుగనుక నీ యభిమానం బాగుగాలేదని తాత్పర్యం. ఒక్కొక్క. భూతమేనేనుకాదంటే భూతములకలయికనే కుదరదు. గనుక నీమతం యుక్తికి ప్రమాణమునకు కూడా పూర్తివిరుద్దమని చెప్పుటకు ప్రత్యేకముగా ఒక్కొక్కభూతమునే నేనుకాదని నిరాకరించిరి. చార్వకులు ఆకాశమనే భూతమును ఒప్పకపోయినను సిద్దాంతంలో ఆకాశం భూతమేగనుక, నాల్గుభూతములు ఆత్మకాదంటే ఆకాశము ఆత్మ యుగునాయని శంకకులగునేమోనని న.ఖం. ఆకాశముకూడా నేనుకాదనిరి. లేక మరియొకవిధముగాకూడా అర్థం చేప్పవచ్చును. ఖం అనగా శూన్యమని అర్థము. (సర్వం శూన్యం) అంత శూన్యమని. బుద్దుని ఒక శిష్యుడగు మాధ్యమికుడు బౌద్ధమతమును ప్రతిపాదిస్తాడు. వానికి సమాధానంగా నఖం అన్నారు. అనగా ఓరిమూర్ఖుడా! అంతా శూన్యంకాదురా శూన్యమని గుర్తించేవాడుండవలయినుకదా. గుర్తించేవాడు లేనిది శూన్యమని రుజువెట్లగును? శూన్యమనిచెప్పే నీవున్నావుకదా, గనుక శూన్యమును గుర్తించువాడే ఆత్మయని తెలుసుకొనవలయును. గనుక నీమతం పూర్తివిరుద్ధము యుక్తిశూన్యమని చెప్పిరని గ్రహించవలయును. ఇంద్రియం ప్రత్యేకంగా ఆత్మకాదు. ఇంద్రియసముదాయమూ భూతసముదాయము కూడా ఆత్మకాదు. అత్మ వేరుగాలేనిది సముదాయమేకుదరదు. కుదిరినను అది ఆత్మకాదని భావము. భూతముల సమూహము అనగా సముదాయము నేనుకానని చెప్పినందువలన భూతమువలనపుట్టిన ప్రాణముగాని మనస్సుకాని నేనుకాని యర్థముకూడా సూచించబడినది. కర్తృత్వము, భోక్తృత్వము మొదలగు ధర్మములన్నియు విజ్ఞానంకూడా మనస్సు ధర్మములేగనుక మనోవృత్తిరూపమైన క్షణికవిజ్ఞానం ఆత్మకాదని కూడా నిరాకరించినట్లే. దేహం ఆత్మకాదు. ఇంద్రియములు ఆత్మ కాదు. విజ్ఞానం ఆత్మకాదు. శూన్యం ఆత్మకాదు. ప్రాణము ఆత్మకాదు. మనస్సు ఆత్మకాదు, కర్త ఆత్మకాదు, భోక్త ఆత్మకాదని ఇతరమతములను నిరాకరించిరి. అన్నియు మార్పును చెందునవేగనుక నిత్యములుకావు. అన్నియు ఆత్మయందే ఆజ్ఞానముచేత కల్పింపబడినవి. అందుచేతనే అధిష్టానమగు ఆత్మకంటే వేరుకావు. భ్రాంతిని పొందినవాని భ్రాంతిదృష్టియే భ్రమప్రపంచమునకు మూలంగనుక భ్రాంతిదృష్టి లేకపోతే ప్రపంచమే లేదు గనుక. అవస్థాత్రయం మార్పును చెందినను అన్నిటిక సాక్షిగానుండే సచ్చిదానందరూపుడనే నేనుకాని, వేరుకాదుని వేదంతసిధ్దాన్త రహస్యం. ఈప్రకారం పరమాత్మ స్వరూపమును తెలుసుకొని సంసారబంధమునుండి విముక్తులై సచ్చిదానందరూపమైన పరమాత్మ స్థితియనే మోక్షమును పొందవలయునని భావము భౌతికమగు దేహేంద్రియములను మనస్సును, బుద్దిని, ఆత్మయని భ్రమించే మతాంతరములను ముందు నిరాకరించుటచేత దేహేంద్రియములకంటే ఆత్మ వేరుగానున్నదని తెలుసుకొనవచ్చును. శివఃకేవలో7 హం అన్నందువల్ల అద్వితీయమైన సచ్చిదానందరూపమే ఆత్మయని స్వరూపమును తెలుసుకొనవచ్చునని. ఈ ఛాయగా ఇతరని షేధంచేస్తూ స్వరూపమును ఈ శ్లోకములలో చెప్పిరని గమనించవలయును. అవతరణిక. ఇక్కడ ఒక ప్రశ్న. అద్వైతమతంలో ఆత్మకు ఏ ధర్మములు లేవు కదా.ప్రమాతా ప్రమాణం ప్రమేయం అనగా తెలుసుకున్నేవాడు, తెలియ చేసే ప్రత్యక్షాది ప్రమాణములు. తెలియబడే పదార్థములు అన్నియు అజ్ఞానముచేతనే కల్పితములుకదా. అటులైన ధర్మములను బోధించు శాస్త్రము కూడా ప్రమాణంకాదని చెప్పవలయునుకదా. ఆత్మకు కర్తృత్వము భోక్తృత్వము లేకపోతే కర్మలయందుగాని, ఇతరములయందుగాని ప్రవృత్తియే లేకపోవలసివచ్చునుకదా. అద్వైతమతంలో ప్రమాతయే లేకపోతే ప్రమాణములు లేవుకదా. అంతయూ భ్రమయేగనుక వేదములుకూడా ప్రమాణములు కాదుగదా. వేదములే ప్రమాణములు కాకపోతే ప్రపంచముమిధ్యా, అద్వితీయమగు సచ్చిదానంద బ్రహ్మయే సత్యమని అద్వైతసిద్ధాన్తమే కుదరకపోవలసివచ్చునుకదా. అదైతం సిద్ధించవలెనంటే వేదప్రామాణ్యము నంగీకరించవలయును కదా. వేదప్రామాణ్యము నంగీకరిస్తే ప్రమాతా, ప్రమాణం, ప్రమేయం అను వ్యవహారమున్నట్లేగనుక మరల అద్వైతమునకు హానియేకదా అనే ప్రశ్నకు సమాధానంగా ఈ రెండవ శ్లోకమును చెప్పిరి. సమాధానం. మీరుచేసేప్రశ్న బ్రహ్మజ్ఞానం కలిగినతరువాతనా, జ్ఞానంకలుగుకముందా. జ్ఞానం కలుగకముందు అజ్ఞానదశ##యే గనుక. అజ్ఞానమున్నంతవరకు ప్రమాతా, ప్రమాణం, ప్రమేయమనే వ్యవహారమంతయు ప్రమాణమనే చెప్పవలయునుగనుక. వేదము ప్రమాణమనే చెప్పవలయును. గనుక వేదప్రమాణముచేతనే అద్వితీయబ్రహ్మసిద్ధించును. అందువలన జ్ఞానము కలిగినతరువాత ఆత్మకంటే భిన్నమగు దృశ్యమంతయు నశించునుగనుక అట్టి పరమార్థదశయందు ప్రమాత, ప్రమాణం ప్రమేయం అను వ్యవహారం లేదనియే మా సిద్ధాంతమని ఈ శ్లోకముతో చెప్పుచున్నారు. శ్లో || నవర్ణాన వర్ణాశ్రమాచార ధర్మాన మేధారణా థ్యాన యోగాదయో7పి| అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్త దేకోవశిష్ట శ్శివః కేవలో7హం ||2 || ప్రతిపదార్థ నిరూపణము. మే=నాకు, వర్ణాః =బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే వర్ణములు, న=లేవు, వర్ణాశ్రమాచార ధర్మః- వర్ణ= బ్రాహ్మణ క్షత్రియాది వర్ణములయొక్క, ఆశ్రమ=బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వాన ప్రస్థాశ్రమముమొదలగు ఆశ్రమములయొక్క; ఆచారధర్మాః =ఆచారములు ధర్మములు; న=లేవు; అనగా ఆయావర్ణములలో ఆయాఆశ్రమములవారు ఆచరించతగిన స్నానము, శౌచము అనగా పరిశుద్ధముగానుండుట మొదలగుఆచారములు, సంధ్యావందనం, బ్రహ్మచర్యం , గురుసేవా, వేదశాస్త్రములను చదువుకొనుట మొదలగు ధర్మములు నాకు లేవని యర్థము, మే=నాకు ధారణాధ్యాన యోగాదయో7పి-ధారణా=బైటప్రపంచమును విడచి మనస్సును ఏకాగ్రముగా స్థిరముగా నుంచుకొనుట, ధ్యాన= ఆత్మధ్యానము, యోగాదయో7పి=చిత్తవృత్తిని నిలుపుట, శ్రవణము మననము మొదలగు నవి, న =లేవు, ఎందువలనలేవంటే అనాత్మాశ్రయాహం మమాధ్యాసహా నాత్ =అనాత్మయనగా ఆచత్మకంటే భిన్నమైన, ఆత్మవిరోధియైన అజ్ఞానమే. అట్టి అజ్ఞానమే ఆశ్రయ=మూలముగాకల అనగా కారణముగాకల అహం మమాధ్యాసహానాత్ =నేను కర్తను, భోక్తను, మనుష్యుడను అను అహంకారధ్యాసయొక్కనాయిల్లు, నాభార్య, నాపుత్రాదులనే మమకారధ్యాసయొక్క హానాత్ =విడిచిపెట్టుటవలన అనగా ఆత్మసాక్షాత్కారము కలిగిన తరువాత అజ్ఞానముతో సహా=సర్వదృశ్యము నశించునుగనుక ఏమియులేవని యర్థము. (తత్=అప్పుడు) ఆకారణమువలన అహం=నేను, ఏకః =అద్వితీయుడను. అవశిష్టః =అజ్ఞానప్రపంచమంతయు నశించినను నాశము లేకుండా అన్నిటికి సాక్షిగా మిగులువాడను. కేవలః =ఏధర్మములు లేని, శివః =ఆనందబోధస్వరూపుడనే యని యర్థము. తాత్పర్య వివరణం. జీవుడు, ఈశ్వరుడు, ప్రపంచము, వర్ణములు, ఆశ్రమములు, కర్మలు, ఆచారములు, జ్ఞానియని, అజ్ఞానియని, బద్ధుడని, ముక్తుడని, ప్రమాతయని, ప్రమాణమని, ప్రమేయమని, ఈ భేదములన్నియు అజ్ఞానమువలననే ఏర్పడినవిగనుక అజ్ఞానమున్నంతవరకే వుండువు. నేను జీవుడను, మనుష్యుడను అనేభ్రమ యున్నంతవరకు అన్నియు ప్రమాణములుగానే అంగీకరించవలయును. జ్ఞానముకలిగినతరువాత దీపం వేలిగిస్తే చీకటిపోయినట్లు అజ్ఞానంపోవునుగనుక అజ్ఞానం వలనఏర్పడిన సర్వ ప్రపంచము నశించునుగనుక ఆరోపితములగు సకల వర్ణాశ్రమ ఆచార ధర్మములు మొదలగునవి నాకు ఏమియులేవు. అధిష్ఠానస్వరూపమైన సచ్చిదానందమైన అద్వితీయమైన నిర్గుణమైన స్వరూపమే నేనుకాని వేరుకాదు. నాకంటే వేరేమీలేదని భావము. ఆవతరణిక. సర్వవ్యవహారములు ఆత్మను ఆవరించిన మూలాజ్ఞానమువలననే ఏర్పడినవిగనుక మిధ్యాభూతములనే విషయమును దృఢపరచుటకు సుషుప్తియందు ఏమియులేవని శృతులు చెప్పుచున్నవని ఈ శ్లోకములో ప్రతిపాదించుచున్నారు. శ్లో || నమాతా పితావాన దేవానలోకాన వేదానయజ్ఞాన నతీర్థం బృవంతి | సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వా త్తదేకో 7వశిష్ట శ్శివః కేవలో7హం ||3|| ప్రతిపదార్థ నిరూపణము. సుషుప్తౌ=సుషు ప్త్యవస్థయందు, మాతా=తల్లి, న=లేదు, పితావా=తండ్రికూడా, న=లేడు, దేవా=ఇంద్రాదిదేవతలు, న=లేరు, లోకాః=స్వర్గము మొదలగు లోకములు, న=లేవు, వేదాః=వేదములు, న=లేవు, యజ్ఞాః=జ్యోతిష్టోమము మొదలగు యజ్ఞములు, న=లేవు, తీర్థం=కురుక్షేత్రాది తీర్థంకూడా, న=లేదని, బృవంతి=శృతులు చెప్పుచున్నవి. అనగా అన్నియు దేహముతో తాదాత్మ్యభ్రమవలనను, అంతఃకరణతో తాదాత్మ్య భ్రమవలనను ఏర్పడినవేగనుక సుషుష్త్యవస్థయందు దేహాభిమానమే లేనపుడు మనస్సేలేనపుడు ఇవన్నియు లేవనియే యర్థము. అయితే సుషుప్త్యవస్థయందు ఏమీలేకపోతే శూన్యమేకదా. ఆత్మ లేదుకదాయని ప్రశ్నచేస్తే దానికి సమాధానం -నిరస్తాతి శూన్యాత్మకత్వాత్. నిరస్తా=పోయిన, అతిశూన్యాత్మకత్వాత్=మిక్కిలి శూన్యత్వము కలవాడనగుటవలన, అనగా సుషుప్త్యవస్ధయందు ఏమిలేదు సుఖంగా నింద్రించితినని మేల్లొన్నతరువాత అనుకుంటున్నాముగనుక అపుడు ప్రపంచంలేకపోయినను లేదనిగ్రహించిన సాక్షియున్నాడనియే చెప్పవలయును గనుక అతిశూన్యంకాదు. అనగా పూర్తిగా శూన్యంకాదు. అపుడు ఆత్మ ఉన్నదని యర్థము. తత్=అపుడు నేను అద్వితీయమైన, నాశములేని, నిర్గుణమయిన, ఆనందబోధ స్వరూపుడనని యర్థము. తాత్పర్య వివరణం. అద్వైతసిద్ధాంతంలో ప్రపంచమంతయు అజ్ఞానకల్పితమేగనుక అంతయు భ్రమయనియే చెప్పవలయును, భ్రమ ఎప్పుడు భ్రమనుపొందే వానియొక్క విక్షేపప్రధానమైన భ్రమ దృష్టిమీదనే ఆధారపడియుండును కదా. అట్లయినపుడు గాఢసుషుప్త్యవస్థయందు భ్రాంతిదృష్టియే లయించును. గనుక భ్రమరూపమగు దృశ్యప్రపంచమంతయు నశించునని చెప్పవలయును. అందుచేతనే సుషుప్త్యవస్థ నిత్యప్రళయమని వేదాంతులు చెప్పెదరు. అట్టి దశయందు కూడా ఆత్మ స్వప్రకాశ సాక్షిగానుండును. సుషుప్త్యవస్థయందు స్థూలప్రపంచము, సూక్ష్మప్రపంచముకూడా కారణమగు అజ్ఞానములో లయించును. అపుడు అజ్ఞానము విక్షేపశక్తితగ్గి అధిష్ఠానమగు ఆత్మను ఆవరించి ఆవరణశక్తి ప్రధానముగా నుండును. ఆ సమయమందు అంతఃకరణకూడా లయించినదిగనుక అంతఃకరణ వృత్తులుండవు. అవిద్యాకార అవిద్యావృత్తి, ఆనందాకార అవిద్యావృత్తియని రెండు అవిధ్యావృత్తులు మాత్రముండును. ఆనందాకార అవిద్యావృత్తియందు అధిష్ఠానమమగు ఆనందరూపమైన ఆత్మ ప్రతిబింబించును. అదియే ఆసమయమందున్న ఆనందానుభవము. ఆ రెండు అవిద్యావృత్తులు నశించునుగనుక. ఆ అనుభవనాశం అనగా అనుభవసూక్ష్మావస్థ అనే సంస్కారమువలన మేల్కొన్నతరువాత జీవునికి నాకేమీ తేలియలేదు సుఖంగా నిద్రపోతినని, స్మరణ కలుగుచున్నదని అనేకమాట్లు చెప్పినవిషయమే. అట్టి సుషుప్త్యవస్థయందు ప్రాజ్ఞుడగు జీవుడు అంతర్యామియగు పరమేశ్వరునితో తాదాత్మ్యమును పొందియున్నాడు. ప్రతినిత్యము సుషుప్త్యవస్థయందు అందరు జీవులు ఈశ్వరునితో తాదాత్మ్యమును పొందుచునే యున్నారని గ్రహించవలయును. ఆ సుషుప్తిసమయమందు తల్లి తల్లికాదు. తండ్రి తండ్రికాదు, దొంగవాడు గొందవాడుకాడు. పాపి పాపికాడు, అని అన్నియు లయించి ఈశ్వరతాదాత్మ్యమును పొందునుగనుక మహావాక్యమలక్ష్యమైన నిర్గుణ బ్రహ్మయే జీవునికి పరమార్థమని చెప్పదలచి అది దురవగాహముగనుక అనుభవములోనున్న సుషుప్త్యవస్థయందే జీవుడు సర్వవిక్షేపములేనివాడై ఈశ్వరస్వరూపుడగుచున్నాడుకదా గనుక దేహాభిమానస్థితి సత్యంకాదు. జ్ఞానముచేత అజ్ఞానం నశించినపుడు సచ్చిదానంతరూపుడై యుండును. మరలజీవభావం రాదు. సుషుప్త్యవస్థయందు మరల విత్తనమువలె అజ్ఞానమున్నది. గనుక మెళుకువవచ్చేసరికి అజ్ఞానం మరల ప్రపంచరూపముగా పరిణమించుచున్నది. మరల ఆత్మ దేహతాదాత్మ్యమును పొందుచున్నది అజ్ఞానంపోయిన ఇట్టిస్థితి కలుగదనికూడా గ్రహించతగిన విషయమేనని చెప్పిరి. మరియు అవస్థాత్రయం మారినను దృశ్యప్రపంచం ఒక అవస్థలోకనిపించి ఒక అవస్థలో కనిపించకపోయినను అస్పష్టముగా నైనను ఆత్మ అన్నియవస్థలలో అనుగతమైయున్నది. గనుకనే సత్యస్వరూపుడు. అనుగతముకాని ప్రపంచమంతయు అనృతమని అనగా మిధ్యాభూతమని, అది ఆత్మకంటే భిన్నముకాదని అట్టి అద్వితీయమగు నిత్యమగు, నిర్గుణమగు స్వప్రకాశానంద స్వరూపుడనే నేనని సాక్షాత్కారమును పొంది ముక్తులుకావలయునని పరమానుగ్రహముతో శ్రీ శంకర భగవత్పాదులవారు ఉపనిషత్సారమును మనకు సంగ్రహముగా సులభ##శైలిలో ఉపదేశించిరని గ్రహించవలయును. ఆవతరణిక. తత్వమసియను మహావాక్యంలో తత్ అనే పదమునకు జగత్కారణమైన బ్రహ్మయే అర్థము. త్వంపదమునకు జీవుడు అర్థము. అసియనే పదము ఐశ్యమును బోధించును, జగత్కారణమైన బ్రహ్మవే నీవని బ్రహ్మతో ఐక్యమును బోధించుచున్నది మహావాక్యం. జగత్కారణం బ్రహ్మ అనే పక్షంలో బ్రహ్మైక్యం జీవునకు కుదురును. జగత్కారణం బ్రహ్మకాదనే పక్షములనేకములున్నవి, ఆ పక్షములలో కుదరదు. సాంఖ్యులు త్రిగుణాత్మకమైన ప్రధానమే అనగా ప్రకృతియే జగత్కారణమందురు. పశుపతియే జగత్కారణమని ఆయన చేతనస్వరూపుడని జీవుని కంటే భిన్నుడని జీవునిచే నుపాసింప తగినవాడని పాశుపతమతస్థులు చెప్పెదరు. భగవంతుడనగా వాసుదేవుడేనని, ఈశ్వరుడని, జగత్తునకు కారణమని ఆయనవలన సంకర్షణుడనే జీవుడు పుట్టునని ఆ సంకర్షణుని వలన ప్రద్యుమ్నుడు, మనస్సు పుట్టునని ఆ ప్రద్యుమ్నుని వలన అహంకారము అను అనిరుద్ధుడు పుట్టునని, జీవుడు కార్యభూతుడు గనుక ఆ జీవునితో బ్రహ్మ అయిన వాసుదేవునికి పూర్తిగా భేదమేనని పాంచరాత్ర మతస్థులు చెప్పెదరు. సముద్రోదకమునుండి తరంగాది పరిణామములు పుట్టినట్లు సర్వజ్ఞుడగు బ్రహ్మవలన ప్రపంచము, జీవులు పరిణామముగా పుట్టుదురు. అనగా బ్రహ్మయే జగత్తువలె. జీవులవలె పరిణమించును అందుచేతనే బ్రహ్మకు జగత్తుతోను జీవులతోను భేదము, అభేదముకూడా వుండునని జైనులుత్రిదండి మతస్థులు చెప్పెదరు. జగత్తుకు కారణమైన సర్వజ్ఞుడగు బ్రహ్మయే లేడు, వేదమంతయు కర్మనే బోధించును. బ్రహ్మను బోధించదు. వాక్కును కామధేనువుగా ఉపాసించమన్నట్లు సర్వజ్ఞుడగు బ్రహ్మ ప్రపంచమును సృజించునని చెప్పిన స్థలములయందు జగత్తునకు కారణమైన పరమాణువులను సర్వజ్ఞత్వముతో కూడియున్నట్లు ఉపాసించమని కాని, జీవుల అదృష్టముతోనే ప్రపంచం పుట్టును. గనుక జీవునియందే జగత్కారణం సర్వజ్ఞుడని దృష్టిని నిలిపి వుపాసించమని గాని ఆ వాక్యములకు అర్థమని మీమాంసకులు చెప్పెదరు. జీవునికంటే వేరుగా సర్వజ్ఞుడగు ఈశ్వరుడున్నాడని తార్కికులు చెప్పెదరు. క్షణిక విజ్ఞానస్వరూపుడే ఆత్మయని బౌద్ధులు చెప్పెదరు. క్లేశములను కర్మలను అంటకుండా ప్రధానముయొక్క సత్వగుణమందు ప్రతిబింబించి సర్వజ్ఞుడై జీవులకంటె వేరుగా ఈశ్వరుడున్నాడని యోగమతస్థులు చెప్పెదరు. అద్వితీయ సచ్చిదానంద స్వరూపమేపరమాత్మయని, ఆ పరమాత్మయే జీవునికి యధార్థస్వరూపమని మాయవలన సర్వజ్ఞత్వాదులు కలిగి జగత్తుకు ఉపాదాన కారణం, నిమిత్తకారణం కూడా అగుచున్నదని అద్వైతవేదాంతులు చెప్పెదరు. ఈ రీతిగా జగత్కారణం విషయంలో భిన్న భిన్నముగా అనేక మతము లున్నందువలన ఇతర మతములను ఖండించుచు అద్వైత సిద్ధాన్తమునే ప్రతిపాదించుటకు ఈ శ్లోకమును చెప్పిరి. శ్లో || నసాంఖ్యం నశైవం నతత్పాంచ రాత్రం నజైనం నమీమాంస కాదేర్మతంవా | విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్త దేకో7వశిష్ట శ్శివః కేవలో7హం ||4 || ప్రతిపదార్థ నిరూపణము. నసాంఖ్యం-సాంఖ్యం =సాంఖ్యమతము, న=మంచిదికాదు. మహావాక్యములు చేతనమైన పరమాత్మతో జీవునికి ఐక్యమును బోధించుచున్నవి. గనుక అచేతనమైన మూలప్రకృతియే జగత్కారణమయ్యే యడల జడమైన మూలప్రకృతితో జీవునికి ఐక్యము బోధించినట్లు చెప్పవలయును. అది మంచిదికాదు. అందువలన సాంఖ్యమతము యుక్తముకాదని యర్థము, శైవం=శైవమతము, న=మంచిదికాదు, పాంచరాత్రం=పాంచరాత్ర మతం, న=మంచిదికాదు. జైనం=జైనమతం, న=మంచిదికాదు. న మీమాంస కాదేర్మతంవా=మీమాంసకమతం ఆదిపదంచేత న్యాయమతం వైశేషికమతం మొదలగు ద్వైత మతములన్నియు, న=మంచివి కావు. పరమాత్మయందు ద్వైతం లేదని శృతులు చెప్పుచున్నవిగనుకను పరమాత్మకంటే జీవుడు వేరులేడని చెప్పుచున్నందువలనను, బ్రహ్మ అద్వితీయమని బోదించుటచేతను, బ్రహ్మయే జగత్కారణమని చెప్పుటచేతను పైన ఉదహరించిన మతములన్నియు శాస్త్రయుక్తులకు సమ్మతములు కావని యర్థము. అన్నిమతములు మంచివికావనుటలో హేతువు. (యెందువలనంటే) విశుద్ధాత్మకత్వాత్=ఏ కల్పనలు లేని అద్వితీయమైన చైతన్యరూపగుటవలన అని అర్థము. ఆత్మ నిర్వికల్ప అద్వితీయ చైత్యరూపము ఎందుచేతనంటే, విశిష్టానుభూత్యా - విశిష్ట = విలక్షణమైన, అనుభూత్యా =అనుభవముచేత అనగా జ్ఞాతా జ్ఞానం జ్ఞేయం అను త్రిపుటితో కూడిన అనగా సవికల్పానుభవముకంటే భిన్నమైన మహావాక్యము వలన కలిగిన తత్పద, త్వం పదములకు లక్ష్యమగు అద్వితీయ సచ్చిదానంద విషయక అనుభూతిచేత నేను నిత్యమైన, అద్వితీయమైన, నిర్గుణమైన ఆనందబోధ స్వరూపుడనే యని యర్థము. తాత్పర్య వివరణం. అచేతనమైన సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతియే ప్రపంచమునకు కారణమనియు, ఈశ్వరుడు లేడనియు సాంఖ్యులు చెప్పెదరు. శృతులు సర్వజ్ఞుడయిన పరమాత్మయే. ఈక్షణసంకల్ప ప్రయత్నముల చేతజగత్తును సృష్టిచేయుచున్నాడని చెప్పుచున్నవి. సర్వం బ్రహ్మయే యని, సర్వం ఆత్మయే యని, ఆత్మకంటే వేరేమియు లేవని చెప్పుచున్నవి. పరమాత్మను తెలిసికున్నయడల జీవుడు పరమాత్మయే యగునని చెప్పుచున్నవి అటులయిన జీవభావము ప్రపంచము అజ్ఞానమువలననే ఏర్పడినవని చెప్పవలయును కదా. అజ్ఞానము వలన ఏర్పడినదనగా భ్రమ యనే అర్థము. భ్రమ అయినపుడే, జ్ఞానముచేత నశించునుగాని, సత్యమైన యడల జ్ఞానముచేత నశించదు. ఒక పరమాత్మ తెలిస్తే సర్వం తెలియునని, ఏకవిజ్ఞానేన సర్వ విజ్ఞానప్రతిజ్ఞ ఒకటి ఉపనిషత్తులయందు కనిపించుచున్నది. సర్వం బ్రహ్మరూపమయినపుడే, బ్రహ్మ తెలిస్తే సర్వం తెలియునుగాని, బ్రహ్మకంటే వేరుగా ఒకటి ఉన్నయడల బ్రహ్మతెలిస్తే సర్వం తెలియుట కుదరదు గనుక, అంతయు బ్రహ్మరూపమేనని చెప్పవలయును. ఎటులననగా బ్రహ్మయందు సర్వం ఆరోపితమయినపుడే సర్వం బ్రహ్మరూపమగును. అనగా బ్రహ్మయే అజ్ఞానముతో నావరింపబడి జీవ ఈశ్వర జగద్రూపముగా భాసించుచున్నదని చెప్పవలయును. ఆత్మయన్నను బ్రహ్మయన్నను ఒకటేగాని వేరుకాదని గుర్తించవలయును ఆత్మయే అధిష్ఠానముగాకల భ్రమను వేదాంతులు అనుభవానుసారముగా చెప్పిరని గమనించవలసిన విషయం. అధిష్ఠానము ఆత్మయేగనుక, అట్టి అధిష్ఠాన సాక్షాత్కారమే అజ్ఞానమును పోగొట్టును. అందువలననే ఆత్మసాక్షాత్కారమును సంపాదించుటకు శ్రవణము, మననము, నిదిధ్యాసనము చేయవలయునని శృతి చెప్పుచున్నది. అందువలన జడమయిన ప్రకృతికి జగత్కారణత్వం కుదరదు. అచేతనమైన ప్రకృతి ఇంత విచిత్రమైన ప్రపంచమును రచించలేదు. అట్టి ప్రకృతితో జీవునికి ఐక్యము కుదరదు. సర్వరూపమగునది ఒకటి లేదుగనుక, ఒకటితెలిస్తే సర్వం తెలియుట కుదరదు అందుచేత సాంఖ్య మతము మోక్షప్రదముకాదని తాత్పర్యము. జీవబ్రహ్మైక్యమే శృతి సమ్మతముగాని జగత్తునకు సత్యత్వము శృతిప్రమాణ విరుద్ధముగనుక, శైవమతంకూడా గ్రాహ్యము కాదు. అందుచేతనే పాంచరాత్ర మతం కూడా పరమశ్రేయస్సుకు సాధనం కాదు. జైనమతం నాస్తికమతంగనుక పూర్తిగా విడిచిపెట్టవలసినదే. కర్మకు అంగముగా వేదము ఆత్మను బోధించుచున్నదని. (స్వతంత్రముగా) వేదము స్వప్రధానముగా ఆత్మను బోధించదని, పూర్వమీమాంసకులు చెప్పెదరుకాని, నిత్యమైన అన్నింటికంటె గొప్పదైన పరమానంద ప్రాప్తియగు మోక్షమనే ఫలమును ప్రయోజనంగా చెప్పుచూ అట్టి మోక్షమునకు జీవ బ్రహ్మైక్యసాక్షాత్కారమే సాధనమని అద్వితీయ మగు బ్రహ్మనే పరమతాత్పర్యముతో వేదాంతములు ఆరోపప్రపంచమును నిరసిస్తూ బోధించుచున్నవని వేదాంతులు చెప్పెదరు ఇట్టి స్వతంత్రమగు జ్ఞానకాండను కర్మకాండలో చేర్చి అన్వయించుటచేత మీమాంసక మతం కూడా యుక్తియుక్తముకాదు. కర్మకు, జ్ఞానమునకు చాలా తేడా యున్నది. ప్రయత్నంతో శరీరముచేత, వాక్కుచేత, మనస్సుచేతను శాస్త్రము ననుసరించి అధికారులు చేసేవి కర్మలు. వీటికి ఫలమును అనగా స్వర్గసుఖం మొదలగు ఫలములను శరీరం పోయినతరువాత స్వర్గాదిలోకములలో మరియొక శరీరమును పొంది అనుభవించవలయును. ఆ స్వర్గాది సుఖం, కర్మ ఖర్చుకాగానే పోవును. ఆ తరువాత మరల క్రిందిలోకములలో జన్మ నెత్తవలసి వచ్చును. వ్యవసాయం , వ్యాపారం మొదలగు లోకంలో ప్రసిద్ధమైన కర్మలఫలములు అనగా ధనధాన్య సంపాదన మొదలగు ఫలములు ఎట్లు అనిత్యములో అటులనే శాస్త్రీయమగు పుణ్యకర్మలుకూడా అనిత్యమైన స్వర్గాదిసుఖములనే ఇవ్వగలవుగాని, నిత్యఫలము నివ్వజాలవు. గనుక కర్మ పురుషప్రయత్న సాధ్యం అనిత్యఫలం కలదియే. ఆ ఫలంకూడా ఎప్పుడో వచ్చునుగాని అప్పటికప్పుడు రాదు. ఆ సుఖం పోవునపుడు మరల దుఃఖమునకే దారి చూపును. గాని నిత్యసుఖం రాదు. ఉపాసనకూడా మానసికక్రియయే గనుక ఉపాసనాఫలంకూడా దాదాపు కర్మఫలంలాంటిదే గాని నిత్యముకాదు. జ్ఞానంమాత్రం పురుషప్రయత్నంతో సంపాదించేది కాదు. నేత్రములకు కొన్ని వస్తువుల ప్రత్యక్షజ్ఞానం కలుగునుకదా. ఈ జ్ఞానంప్రయత్నసాధ్యంకాదు. పురుషప్రయత్నం యెంత వరకంటే నేత్రములు విప్పి ఆ వస్తువులమీదికి చూపుపెట్టేంతవరకే. తరువాత కలిగే జ్ఞానం వస్తువు యెట్లావుంటే అట్లే కలుగునుగాని ఒకవస్తువును చూస్తూ మరియొకవస్తువని జ్ఞానంకలుగవలెనంటే సాధ్యంకాదు. కళ్ళు మూయడం, తెరవడం, మరియొకచోట చూడడం ఇవి ఇష్టం వచ్చినట్లు ప్రయత్నంతో చేయవచ్చును. ఒకవస్తువుయందు ఉపాసన భావనకూడా విధిప్రకారంగా ప్రయత్నంతో చేయవచ్చును. మార్చుకొన వచ్చును కూడా. గాని జ్ఞానంమాత్రం ప్రయత్నసాధ్యంకాదు. ఈ జ్ఞానం సిద్ధమైన బ్రహ్మవిషయకమేగాని సాధ్యవిషయముగాదు. జ్ఞానమువలన అజ్ఞానం నశించగానే అజ్ఞానరహితమైన సచ్చిదానంద రూపమగు ఆత్మయే మోక్షము. ఇట్టి ఆత్మరూపమగు మోక్షము సిద్ధమేగాని సాధ్యము కాదు. ఆత్మరూపముగనుకనే మోక్షము నిత్యము. ఇట్టి మోక్షము ఈ శరీరమున్నను జ్ఞానంకలిగితే లభించును. అందువలననే వారిని జీవన్ముక్తులంటారు. విదేహముక్తులని దేహంపోయినతరువాత అంటారు. భ్రాంతుల దృష్టిలో జ్ఞానశరీరము గోచరించినను జ్ఞానికి అంతయు పరమాత్మఅనియే నిశ్చయముండునుగాని ద్వైతదృష్టి యుండదు. గనుక పరమమోక్షప్రదమైన జ్ఞానకాండ స్వతంత్రముగాని కర్మకు అంగంకాదు. ఈ జ్ఞానకాండయందు విరక్తికలిగి మోక్షమును కోరువారే అధికారులుగాని విషయవాంఛకలవారుకారు. కర్మకాండయందు విరక్తిలేక కర్మఫలమును కోరువారును, కర్మఫలములను కోరకపోయినను వైరాగ్యములేని దశలో నున్నవారుకూడా అధికారులే. న్యాయవై శేషికాది మతములుకూడా పరమముక్తికి దూరమయినవేనని శంకరభగవత్పాదులవారు సూచించిరి. వేదాంత్రశ్రవణంచేసి, మననంచేసి బ్రహ్మయే సత్యమని అనగా నాశములేనిదని, జగత్తు మిధ్యాయని అనగా శుక్తి రజతమువలె అసలు వస్తువును తెలిసుకుంటే నశించునని నిశ్చయమును సంపాదించవలెను. నేను పరమాత్మనుకాను. అనే అసంభావనను, నేను జీవుడను, కర్తను, భోక్తను అనే విపరీత భావనను పోగొట్టుకొని తరువాత ఆత్మభిన్నమైన దృశ్యములనుండి మనస్సును విడదీసి ఆత్మకు అభిముఖముగా అనగా ఆత్మయందునిలిపి ధ్యానంచేయవలెను, మొదట ధ్యానంచేయువారికి ధ్యానదశలో కొద్దిభేదం గోచరించును. గనుక దీనిని సవికల్పసమాధియందురు, తరువాత నూనెధారవలె చలనంలేకుండా తెంపులేకుండా నిర్వికల్పసమాధి కలుగును. తరువాత ఆఖండ బ్రహ్మాకారవృత్తిరూప సాక్షాత్కారము కలుగును. ఈ జ్ఞానంవలనసర్వభ్రమలకు మూలమగు అజ్ఞానంనశించును, అజ్ఞానంతోపాటు అజ్ఞానంవలన ఏర్పడిన జీవత్వభ్రమ జగద్భ్రమలుకూడా నశించును. అపుడు కేవల సచ్చిదానందరూపమగు ఆత్మయే మిగులును. ఈ స్వరూపమునే తదేకో7వశిష్ట శ్శివః కేవలో7హం అని చెప్పిరి. ఇట్టి పరమాశ్చర్యకరమైన అద్వైతసిద్ధాన్తమును శంకర భగవత్పాదులవారు సాక్షాత్ ఈశ్వరావతార స్వరూపులు కనుకనే. అజ్ఞానులగు జీవులయందు పరమానుగ్రహంతో ఈ శ్లోకములయందు స్పష్టముగా చెప్పిరి గనుక. అతిశ్రద్ధతోను, సూక్ష్మబుద్ధితోను శంకరసిద్ధాన్తమును గ్రహించవలయును. ఏకాగ్రదృష్టితోను, పరమార్థదృష్టితోను విచారించవలయును. అవతరణిక. శృతులు కొన్నిచోట్ల పరమాత్మ అణురూపుడని చెప్పుచున్నవి. జీవుడు అంగుష్టమాత్రుడని, అనగా బొటనవ్రేలంతటివాడని ఆరాగ్రమాతృడని అనగా ముల్లుకర్ర ముల్లుచివరంతవాడని చెప్పుచున్నవి. అట్టి జీవునితో పరమాతృడని అనగా ముల్లుకర్ర ముల్లుచివరంతవాడని చెప్పుచున్నవి. అట్టి జీవునితో పరమాత్మ అభిన్నుడుగనుక, వ్యాపకుడుకాడని చెప్పవలయును అనే ప్రశ్నకు సమాధానంగా : అంతయు బ్రహ్మయేనని తూర్పుదిక్కుయందు, పడమరదిక్కుయందు, దక్షిణదిక్కుయందు, ఉత్తరదిక్కుయందు, పైన, క్రింద అంతట బ్రహ్మయేనని కార్యకారణములులేనిదని సర్వాత్మకమే బ్రహ్మయని శృతులు బోధించుచున్నవి. అట్టి శృత్యుర్థమునే అద్వైతపరముగా ఈ శ్లోకములో చెప్పుచున్నారు. బ్రహ్మ పరిపూర్ణమని అందువలననే దేశకాలవస్తు పరిచ్ఛేదములేదని సర్వవిశేషములు లేని దని యేధర్మములు లేనిదని స్వప్రకాశానంద స్వరూపుడనికూడా చెప్పుచున్నారు. శ్లో || నచోర్ధ్వం నచాధో నచాంతర్న బాహ్యం నమధ్యం నతిర్యక్ | నపూర్వాపరాదిక్ వియద్వ్యాపకత్యాదఖండై కరూప స్తదేకో7వశిష్ట శ్శివః కేవలో7హం ||5 || ప్రతిపదార్థ నిరూపణం. ఊర్ధ్వం=పైనఅనునది; న=లేదు; అధః=క్రిందఅనునది;న=లేదు;బాహ్యం=బైట అనునది; న=లేదు; మధ్యం=మధ్యభాగమనునది, న=లేదు; తిర్యక్= (ఎదురు) అడ్డమనునది; న=లేదు; పూర్వపరాదిక్ =తూర్పు పడమర అనుదిక్కు ; న=లేదు; విరుద్వ్యాపకత్వాత్ - వియత్=ఆకాశముకంటే; వ్యాపకత్వాత్ = అంతటా నిండినవాడుగనుక ; అహం=నేను; అఖండైకరూపః=దేశకాల వస్తుపరిచ్ఛేదములేని పూర్ణస్వరూపుడను, అద్వితీయుడను, నాశములేనివాడను, నిర్గుణుడను; ఆనందబోధస్వరూపుడను అని యర్థము. తాత్పర్య వివరణం అద్వైతమతం చాలా లోతైన మతం. తెసులుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆనందంకూడా కలుగును. అంతయు ఆత్మయందు కల్పితమేకదా. కల్పితమైన సకల ప్రపంచమునకు ఆత్మ ఉపాదానకారణంకదా. అనగా అధిష్ఠానం. మట్టితోతయారైన ఒక బొమ్మయందు (పరిణామిద్రవ్యమైన) మట్టి అన్ని అవయవములయందు ఎట్లు నిండియుండునో, మట్టికంటే ఆ విగ్రహం వేరులేదో, అట్లే అధిష్ఠాన మైన సచ్చిదానందరూపమైన పరబ్రహ్మ ఆరోపమగు ప్రపంచమందంతయు నిండియుండును. ఆరోపితమగు ప్రపంచం అధిష్ఠానమగు బ్రహ్మకంటే వేరులేదుకూడా, అంతటా బ్రహ్మయే, అంతయు బ్రహ్మయే గనుక. పైన అనిగాని, క్రిందఅనిగాని తూర్పు , పడమర, దక్షిణం, ఉత్తరం బైట, లోపల అను దిక్కులు దేశము అనే విభాగమేలేదని భావము. "అధిష్ఠానావశేషోహి నాశః కల్పితవస్తునః" అను వచనం కల్పిత వస్తువుల నాశం అధిష్ఠానమే మిగులదలకాగలది యని చెప్పుచున్నది. అనగా కల్పితవస్తువు నశిస్తే అనగా భ్రమనశిస్తే అసలు వస్తువు మిగులు నని యర్థము. భ్రమ అంటేనే అసలు వస్తువు ఉన్నదని యర్థము. (భ్రమ పోతే అసలువస్తువే మిగులునని యర్థము.) ఉపవిషద్వాక్యములు అవాజ్మానసగోచరమైన అనగా వాక్కుకు, మనస్సుకు గోచరంగాని బ్రహ్మను బోధించుట శక్యము కాదుగనుక ముందు ఆరోపములేదని బోధించుచున్నవి. ఆరోపనిషేధం చేసినపిమ్మట మిగులునది అధిష్ఠానమేకదా. అందుచేతనే వేదాంతములు అధిష్ఠానమును బోధించకుండా ఆరోపమును బోధించుచు ప్రమాణములగుచున్నవి. ఈ సంప్రదాయము ననుసరించియే శంకరభగవత్పాదులవారు ఈ దశశ్లోకియందు అనగా ఈ పది శ్లోకములందుకూడా, నభూమిర్నతోయం అని మొదలుపెట్టి ఆరోపములైన భూతములను, భౌతికములను నిషేధించుచు తదేకో7వశిష్టశ్శివః కేవలోహం అని అధిష్ఠానమైన నేనే అనగా ఆత్మయే మిగులునని బోధించిరి. ఈ ప్రక్రియలోనే పరమతఖండన స్వమతస్థాపనము కూడా చేసిరి. ఆరోప నిషేధమును చేయుచు అధిష్ఠానమును బాగుగా బోధించు ప్రక్రియ ఈ దశశ్లోకియందు చాల విలక్షణముగా నున్నది గనుక ఈ శ్లోకముల నెన్నిమాట్లు చదివినను చాలనిపించదు. ఈ ప్రక్రియతోనే వేదాంతసిద్ధాన్త రహస్యములను బోధచేసిరి. జీవునికికలుగు ప్రత్యేక భ్రమలనన్నిటిని లేవులేవనిచెప్పిరి. పరమార్థమగు అధిష్ఠానమునకు ఆరోపమేదియు అంటదని సూచించినట్లే యండమావలయందు భ్రమవలన కనిపించిన నీళ్ళతో ఆభూమి తడవదుకదా. గురిగింజలగుత్తియందు కోతులకు అగ్నియని భ్రమకలిగినను భ్రాన్తిసిద్ధమైన నిప్పుతో గురిగింజలగుత్తి తగలబడదుకదా. ఆకాశము దూరత్వదోషము వలన నల్లగా కనిపించినను ఆ నలుపు ఆకాశమునకు అంటదుకదా. స్వప్నములో నీటిలో పడి శరీరమంతయు తడిసి బురద అంటినట్లు కనిపించినను మెళుకువ వచ్చిన తరువాత ఆ తడి, బురద శరీరమునకు అంటియుండదుకదా. అటులనే అధిష్ఠానమగు ఆత్మకు ఏదియు అంటదని తాత్పర్యము. అంతయు ఆత్మ అధిష్ఠానముగాకల భ్రమయేగనుక ప్రతివ్యక్తి నాయందే జీవభావము, ప్రపంచము కల్పితమయినదని సుషుప్త్యవస్థయందు దృశ్యమంతయు పోయినను ద్రష్టయే నిర్వికారుడుగా మిగిలినట్లు అనుభవసిద్ధమైన విషయమే గనుక దృశ్యముకంటే నేను వేరుగా నున్నానని, అధిష్ఠానమగు నాకంటే ఆరోపమగు దృశ్యం వేరేలేదని పరిశోధన ప్రక్రియతోను, బాధప్రక్రియతోను సర్వాతీతమైన ఆత్మనుగుర్తించి అనాత్మ వస్తువులను ఆత్మకంటే వేరుగా లేవని ప్రవిలాపనచేసి మిగిలిన సచ్చిదానందరూప పరబ్రహ్మస్వరూపుడనే నేనని అపరోక్షానుభూతిని పొంది తరించమని తాత్పర్యము. అవతరణిక. అద్వైతమతంలో బ్రహ్మజగత్తునకు ఉపాదాన కారణం అని చెప్పెదరు. ఉపాదాన కారణమునకు, కార్యమైన ప్రపంచమునకును, అభేదమే చెప్పవలయునుకదా. అటులైన ప్రపంచమంతయు నామరూప ములతోను, దుఃఖముతోను నిండియున్నది. ఇట్టి ప్రపంచముతో బ్రహ్మ అభిన్నమయ్యేయడల బ్రహ్మకూడా నామరూపాత్మకము దుఃఖరూపము అగునని చెప్పక తప్పదు. ఇట్టి బ్రహ్మతోజీవుడు ఐక్యమును పొందిన యడల పూర్వమున్న ఒకవ్యక్తి వ్యష్టిదుఃఖముకంటే సమిష్టి దుఃఖమంతయు ప్రాప్తించును గనుక ఆనందరూపమగు మోక్షసిద్ధి జీవునికెట్లు కలుగుననే ప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకమును రచించిరి. బ్రహ్మ స్వప్రకాశానంద స్వరూపము గనుకను, ఉపాదానమనగా అధిష్ఠానమనే అర్థం గనుకను అధిష్ఠానమునకు ఆరోపప్రపంచం యెంతమాత్రముకూడా అంటదని చెప్పుచున్నారు. శ్లో || నశుక్లం, నకృష్ణం, నరక్తం, నపీతం, నకుబ్జం, నపీనం, నహ్రస్వం, నదీర్ఘం | అపూపం, తథాజ్యోతిరాకారకత్వాత్త దేకో7వశిష్ట శ్శివః కేవలో7హం ||6 || ప్రతిపదార్థ నిరూపణము. శుక్లం=తెలుపు, న=కాను, తెలుపుకాను, తెలుపు లేదనికూడాయర్థము. ఇట్లే, కృష్ణం=నలుపు, న=కాను, రక్తం=ఎరుపు, న=కాను, పీతం=పచ్చనిది, న=కాను, కుబ్జం=అణుస్వరూపం, న=కాను, పీనం=గొప్ప స్వరూపము, న=కాదు, హ్రస్వం =పొట్టిస్వరూపం, న = కాను, దీర్ఘం=పొడవైనది, న=కాను, అరూపం, రూపమనగా తెలియచేయబడేది. ప్రమేయమని అర్ధము. తథా=అట్లే. అరూపమనగా ప్రమేయ స్వరూపం కాదని ప్రమేయంలేదనికూడా అర్థము. ఎందువల్లనంటే, జ్యోతిరాకారక త్వాత్ స్వప్రకాశజ్ఞాన స్వరూపుడను గనుక, ప్రమేయస్వరూపుడను కానని యర్థము. నాశములేని, అద్వితీయమైన, నిత్యమైన, నిర్గుణమైన ఆనంద బోధ స్వరూపుడనని యర్థము. తాత్పర్య వివరణం. తెలుపుకాదు, నలుపుకాదు, ఏ రూపముకాదు, లేదు అని చెప్పుటచేతను, అణువుకాదు, మహత్తుకాదు, హ్రస్వంకాదు, దీర్ఘం కాదు అనుట వలనను, ఆత్మ ద్రవ్యస్వరూపం కాదని చెప్పినట్లయినది, అరూపంఅని చెప్పినందువలన, తెలియజేయబడేది కాదనికూడా చెప్పినట్లయినది. ఆత్మకంటే భిన్నమైన ప్రపంచమంతయు జ్ఞానస్వరూపమైన ఆత్మచేతనే. తెలియజేయబడుచున్నది గనుక ఆత్మ స్వప్రకాశమని, ప్రపంచం పరప్రకాశమని గమనించవలయును. అరూపం అని చెప్పినందువలన సకలనామ రూప ప్రపంచంకంటే అతీతమని, నామరూప ప్రపంచం లేనిదని చెప్పినట్లయినది. ఆత్మ జ్ఞానస్వరూపమే కాని జ్ఞేయంకాదు. జ్ఞేయమయ్యేయడల ప్రపంచంవలె జడం కావలసివచ్చును. జ్యోతిరాకారకత్వాత్ అని చెప్పినందువలన ఆత్మదృగృపమని, ప్రపంచం దృశ్యమని, ఆత్మచేతనమని, ప్రపంచం జడమని చెప్పినట్లయినది. అందువలన జడమునకు చేతనమునకు అభేదం సంభవించదు - ఆత్మ అధిష్ఠానమని, ప్రపంచం ఆరోపమని, అద్వైతమతంలో మరువకుండా గుర్తుపెట్టుకొనవలసిన విషయం. అధిష్ఠానమునకు ఆరోప సంబంధ మంత మాత్రముకూడా వుండదని వెనుకకూడా వ్రాసియుంటిని. కష్టమైన విషయం గనుకను శంకరభగవత్పాదులవారు ప్రతి వేదాంత శ్లోకములయందును తరచుగా ఈ విషయమును లోకానుగ్రహముతో చెప్పిరి గనుకను మాటి మాటికి వివరించవలసి వచ్చినది. అందుచేత పునరుక్తియని భావింపకూడదు, శంకర భగవత్పాదుల వారు బ్రహ్మ సూత్రభాష్యంలోకూడా అధ్యస్తమైన గుణముతోగాని, దోగముతోగాని అధిష్ఠానమునకు ఏమాత్రము సంబంధముండదని చెప్పిరి. విషమసత్యత్వము కల పదార్థములకు పరస్పర సంబంధ ముండదు. వేదాంతులు పరబ్రహ్మతత్వమును సులభముగా బోధచేయుటకు ప్రాతి భాసిక సత్యత్వమని, వ్యావహారిక సత్యత్వమని, పారమార్థిక సత్యత్వమని, సత్యత్వము మూడు విధములని చెప్పిరి. అజ్ఞానముకంటే వేరయిన ఆగంతుక దోషములవలన కలుగు భ్రమలు ప్రాతిభాసిక భ్రమలు. శుక్తిరజత భ్రమ, రజ్ఞుసర్పభ్రమ, స్యప్నభ్రమ మొదలగునవి. ఆ భ్రమలలో గోచరించు పదార్థములే ప్రాతిభాసిక సత్యములు. అనగా భ్రమ ఉన్నంతవరకే యుండునని యర్థము. మూలాజ్ఞానమనే అనాది దోషములన కలిగే భ్రమ, వ్యావహారిక భ్రమ, అనగా జాగ్రద్దశయందు మనకు గోచరించు ఈ ప్రపంచ భ్రమయే. ఈ భ్రమయందు గోచరించు భూతములు భౌతికములన్నియు వ్యావహారిక సత్యములు. బ్రహ్మయే పారమార్థికసత్యం. యండమావలయందు కలిగిన భ్రమ విషయమైన పాతిభాసికమైన నీటితో, వ్యావహారికమగు ఆ పూషరభూమి తడయుట లేదు. మామూలు వ్యావహారిక జలముతోనైతే ఆ పూషరభూమి తడియును. అందువలన సమసత్యములగు పదార్థములకు పరస్పర సంబంధ ముండునుగాని విషయ సత్తాకములగు పదార్థములకు పరస్పర సంబంధముండదని తేలినది. అందుచేత పారమార్థిక సత్యమగు పరమాత్మకు వ్యావహారకసత్యమగు పదార్థములతోగాని, ప్రాతిభాసిక సత్యములగు పదార్థములతోగాని సంబంధముండదు గనుక ఆత్మకు నామరూపసంబంధముగాని, దుఃఖసంబంధముగాని యెంతమాత్రముకూడా లేదు. మరియు సర్వం బ్రహ్మయే అన్నపుడు సర్వప్రపంచము బ్రహ్మకంటే వేరుగాలేదనియే చెప్పవలయును గాని బ్రహ్మకంటే అభిన్నమని చెప్పకూడదు. ఒకవస్తువును మరియొక వస్తువుగా భ్రమపడినపుడు అనగా శుక్తిని రజతమని భ్రమించినపుడు ఇది శుక్తియేనని చెప్పి రజతముకాదని, లేదని అంటారుగాని ఈ రెండు అభిన్నములని ఎవ్వరును చెప్పరు. (అందువలననే సర్వం బ్రహ్మ అన్నపుడు బాధాయాం సామానాధికరణ్య మందురు.) బ్రహ్మయే ప్రపంచమువలె భాసించినపుడు ప్రపంచ సంబంధం బ్రహ్మకుండడమేమిటి? పరమార్థముగా బ్రహ్మరూపుడై అజ్ఞానముచేత జీవుడననే భ్రమవలన దుఃఖము ననుభవించుచున్నపుడుగాని నిజంగా దుఃఖమేమిటి? జ్ఞానంకలిగితే అజ్ఞానంపోవును. అజ్ఞానంపోతే జీవత్వ భ్రమ పోవును. జీవత్వభ్రమ పోగానే జీవుడు బ్రహ్మారూపుడుగానుండును. ఇదియే జీవుడు బ్రహ్మైక్యమును పొందడం. ఇట్లయితే పరమాత్మకు ప్రపంచ సంబంధముండునని అట్టి పరమాత్మతో ఐక్యమునుపొందిన జీవునికి వెనుక దుఃఖంకంటే ఎక్కువ సముష్టిదుఃఖము ప్రాప్తించునని మోక్షము లేకపోవుననేప్రశ్న కెంతమాత్రం అద్వైతమతంలో అవకాశం లేదు. తదేకో వశిష్టశ్శివః కేవలో೭హం అని స్పష్టముగా నేను అద్వితీయమగు నిర్గుణ సచ్చిదానందస్వరూపుడనని శంకరభగవత్పాదులవారు పై ప్రశ్నలకు సమాధానం చెప్పిరని గ్రహించవలయును. అవతరణిక. అద్వైతమతంలో బ్రహ్మయేకాని వేరుఏమియు లేదంటారుకదా. అయితే మహావాక్యములు మోక్షముకొరకు ఎవరికి పరమాత్మైక్యమును ఉపదేశించుచున్నవని ప్రశ్నించవలయును. ఈ ఉపదేశం బ్రహ్మకేనా లేక బ్రహ్మ భిన్నమైన మరిఒకరికా యనికూడా ప్రశ్నచేయవచ్చును. బ్రహ్మ భిన్నమంతయు జడమేగనుక జడపదార్థమునకు జ్ఞానోపదేశం అనవసరం. రాళ్ళకు రప్పలకు ఉపదేశిస్తే జ్ఞానముకలుగదుకదా! బ్రహ్మకే బ్రహ్మైక్యోపదేశం అంతకంటే అనవసరం. బ్రహ్మ బ్రహ్మ అయ్యేయున్నాడుకదా ఆయనకు అజ్ఞానమేలేదుగనుక ఉపదేశ##మెందుకు? జీవుడు బ్రహ్మరూపుడైనను అజ్ఞానంవల్ల జీవుడనని అనుకుంటున్నాడుగనుక వానికే అట్టి అజ్ఞానమును పోగొట్టుటకు జీవబ్రహ్మైక్య జ్ఞానోపదేశమందామాఅంటే. జీవునికి జ్ఞానంకలిగితే అజ్ఞానం నశించునుకదా, ఆ అజ్ఞాననాశము ఆత్మకంటే వేరుగానుండునా. అదికూడా ఆత్మరూపమగునా. అజ్ఞననివృత్తి ఆత్మకంటే వేరేవున్నను ద్వైతమున్నట్లే. అజ్ఞాననివృత్తికూడా పోతే అనగా అజ్ఞానము పోవుటకూడా పోయిందంటే అజ్ఞానమున్నట్లేకదా, మరల అజ్ఞానం, ప్రపంచం ఉన్నట్లే గనుక అద్వైతబ్రహ్మసిద్ధి కుదరదనే ప్రశ్నకు సమాధానంగా ఈ దిగువశ్లోకమును రచించిరి. ఈ ప్రశ్నకుసమాధానమిట్లు చెప్పుచున్నారు. ఈ జ్ఞానోపదేశం పరమార్థదశయందు వ్యర్థమంటావా, లేక అజ్ఞానదశయందు వ్యర్థమంటావా, అజ్ఞానదశయందు అజ్ఞానంపోవుటకు జ్ఞానోపదేశం అవసరమేగనుక వ్యర్థముకాదు. అది అటుల వుంచండి, పరమార్థదశయందు జీవబ్రహ్మైక్యమును ఉపదేశించుట వ్యర్థమంటావా అది మాకు ఇష్టమేనని చెప్పుచున్నారు. శ్లో|| నశాస్తా సశాస్త్రం నశిష్యో నశిక్షా నచత్వంనచాహం నచాయం ప్రపంచః| స్వరూపావబోధో వికల్పా సహిష్ణుస్తదేకో వశిష్టశ్శినః కేవలో7హం ||`ò|| ప్రతిపదార్థ నిరూపణం. శాస్తా=శాస్త్రము నుపదేశించునాడు, న=లేడు, శాస్త్రం=తత్వజ్ఞానమునకు సాధనమైన శాస్త్రము. న=లేదు, శిష్యః=ఉపదేశమును పొందువాడు. న=లేడు, శిక్షా=ఉపదేశించు విధానం, న=లేదు, త్వం=వినేనీవు, న=లేవు, అహం=చెప్పేనేను, న=లేను, అయం=ఈప్రత్యక్షాది ప్రమాణములచేత తెలియబడు ప్రపంచం శరీరేంద్రియ సంఘాతము మొదలగు ప్రపంచము, న=లేదు అనగా పరమార్థముగాలేదని యర్థము. పరమార్థదశయందు ఏమియులేవని చెప్పుట మాకును ఇష్టమేనని చెప్పి ప్రతీతినబట్టి అనగా అజ్ఞానదశయందు ఆ పరమార్థదశయందు ఉపదేశం వ్యర్థమనుటకు వీలులేదని చెప్పుచున్నారు. స్వరూపావబోధో వికల్పానహిష్ణుః స్వరూపావబోధః స్వప్రకాశమానమైన పరిపూర్ణఆనందమే శాస్త్రఆచార్య ఉపదేశమువలన కలిగిన అఖండాకార చరమవృత్తియనే ఆత్మసాక్షాత్కారమునకు ఫలము అని అర్థము. అట్టి జ్ఞానమువలన ద్వైతభ్రమ అంతయు నివర్తించిపోవుచున్నది గనుక. వికల్పానహిష్ణుః=ఏవికల్పమును సహించదు. అనగా యెవరికి ఉపదేశం బ్రహ్మకా లేక జీవునికాయని, ఇలాంటిప్రశ్న వికల్ఫములకు అవకాశంలేదనియర్థము. అందువలన పరమార్థముగా, అద్వితీయమైన, నిత్యమైన, నిర్గుణమైన, స్వప్రకాశానంద స్వరూపుడనే నేనని యర్థము. తాత్పర్యవివరణం. అద్వైతసిద్ధాన్తమును అర్థముచేసుకోవలెనంటే ముందు అజ్ఞానదశకు, జ్ఞానదశకు భేదమును గుర్తించవలెను. శాస్త్రము, గురువు, ఉపదేశం మొదలగు భేదములు అజ్ఞానదశయందేగాని, జ్ఞానదశయందు యెంతమాత్రంకూడాలేదు. జీవభావము అజ్ఞానదశయందే యుండునుగనుక, అట్టి జీవునికి అజ్ఞాననివృత్తికి జ్ఞానోపదేశం అవసరమే. జ్ఞానమునకు ఫలమైన మోక్షము ఆత్మరూపమై జ్ఞానికి అనుభవసిద్ధముగా యుండునుగాని అనుభవమునకు దూరమైనదికాదు, స్వరూపావబోధః వికల్పాసహిష్ణుః అని చెప్పిరి. స్వరూపావబోధ యనగా మోక్షమునకు సాధనమైన ఆత్మజ్ఞానమని యర్థముకాదు. ఇక్కడ మోక్షస్వరూపమైన స్వరూపావబోధయే. ఆత్మయనగా బోధస్వరూపమే. బోధయనగా జ్ఞానమేకదా! జ్ఞానమనగా స్వప్రకాశం, స్వప్రకాశమనగా పరప్రకాశ్యంకాదు. ఇతరముచే తెలియచేయబడునది కాదని యర్థము. అట్టి ఆనందస్వరూపము జ్ఞానము చేత అజ్ఞానము నశించినతరువాత ఆవరణరహితమైన నిత్యస్వప్రకాశానంద రూపముగా నుండును. అదియే మోక్షము. ఇట్టి మోక్షమే స్వరూపావబోధయని చెప్పబడినది. ఇట్టి మోక్షరూపమైన, తన స్వరూపమైన స్వరూపబోధ వికల్పమును సహింపదు. అనగా ఆత్మవిషయంలో బాగుగా శాస్త్రము చెప్పినప్రకారం అనుభవమును సంపాదించినయడల ఆత్మవిషయమై ఏప్రశ్నలు పుట్టవు. ఒకప్పుడు ప్రశ్నకలిగినను అనుభవమే సమాధానం చెప్పును. ముఖ్యముగా ఈ విషయంలో అనుభవమును పరిశీలించవలయును, ఎటులననగా స్వయముగా తనకు ఆత్మజ్ఞానమువలన అజ్ఞానంపోయి జీవత్వ ప్రపంచభ్రాంతులుపోయి తనే స్వప్రకాశానంద రూపమైన మోక్షరూపుడయినపుడు ఎవరికి జ్ఞానోపదేశం, ఎవరికి అజ్ఞాననివృత్తి, ఎవరికి బంధము, ఎవరికి మోక్షము అనే వికల్పము అనగా ప్రశ్నలు అనుభవసిద్ధ విషయములో కలుగవని తాత్పర్యము. కలిగినను అనుభవము చేతనే సంశయనివృత్తి యగునని భావము. ఒకవ్యక్తి అన్నిసంపత్తులుకలిగి సుఖంగా తనయింటిలో మంచి మంచముమీద మంచిపరుపుమీద పడుకొని నిద్రపోయినాడు. అతనికి ఎక్కడికో అరణ్యంలోనికి పోయినట్లును, ఆచటగాని మరియొకచోటగాని అనేకమంది బంధుమిత్రాదులు, భార్యాపిల్లలు ఉన్నట్లును, వాళ్ళతో సుఖ దుఃఖములను ఆనుభవించినట్లు, పిల్లలకు వివాహాదులు చేసినట్లు, వాళ్ళవల్ల కొన్ని కష్టములను, సుఖములను అనుభవించినట్లును క్రూరులయిన దొంగలు తన సర్వ ధనమును అపహరించి కళ్ళకు గంతగట్టి చెట్టుకు కట్టివేసి వెళ్ళినట్లు, ఈ విధముగా బాధపడుచు నాకు దైవమే గతియని అనన్యశరణాగతుడై యుండగా ఎవరో ఒక దయామయుడు తన దగ్గరకు వచ్చినట్లును, ఆయనతో తన కష్టము మొరపెట్టుకున్నట్లును, అంతట ఆ దయాళువు అతిదయతో ఆ కళ్ళకు కట్టిన గంతలను విప్పి, కట్టివేసిన తాళ్ళను విప్పి, నీ స్వస్థానమునకు వెళ్ళమని త్రోవచూసినట్లును, ఆయన చెప్పిన మాటలు ప్రకారం స్వబుద్ధితో ఊహించుచు తన స్వస్థానమును చేరినట్లును, ఓక దీర్ఘ స్వప్నము వచ్చినది. é ఇంతలో మెళుకువ వచ్చినది. తరువాత అన్ని పోయినవి. స్వప్నదృశ్యం పూర్తిగా పోయెను. ఇదంతయు అతనికి అనుభవసిద్ధమే గాని ఒకరు కల్పించినది కాదు, చెప్పినదికాదు. ఈ స్థితిలో ఆ వ్యక్తికి ఎవరికి స్వప్నం వచ్చెను. ఎవరికి భార్యా, పుత్రాదులు, ఎవరికి సుఖదుఃఖములు యెవరిని కట్టివేసిరి. యెవరు యెవరిని విడిపించిరి. యెవరు స్వస్థానము చేరునని వికల్పములు కలుగునా. తనే స్వప్నావస్థయందు తన స్వరూపమును మరచి అరణ్యమునకు వెళ్ళినట్లును, కష్టముల ననుభవించినట్లును. బద్ధుడనై తినని, ముక్తుడనైతినని అనుకున్నాడు. ఈ స్వప్నావస్థల యందున్న దృష్టితో అన్నియు వున్నట్లేగాని మెళుకువ వచ్చిన తరువాత స్వప్నావస్థయందు జరిగిన వృత్తాన్తమంతయు క్షణంలో మాయమైపోయెనుకదా. ఇది పరమార్థ దశయని అనుకందాం. మెళుకువ వచ్చినతరువాత దృష్టితో ఆ స్వప్నదశయందు కనిపించిన దృశ్యములు లేవు. ఆ దారాపుతృలు లేరు. ఆ సుఖదుఃఖములు లేవు. ఆ బంధమని బంధం పోయినదని భావములు లేవు. సర్యవ్యవహారరహితుడైనాడు. ఆ స్వప్నకాలమందలి బంధములేదు. అనగా భ్రాంతియే. అది విప్పతీయడంకూడా అబద్ధమే స్వస్థానమునకు వెళ్ళుట అబద్ధమే. బంధమే లేనపుడు మోక్షమేమిటి? కట్టడమే లేకపోతే స్వప్నములోవిప్పడ మేమిటి? ఇదంతయు స్వప్న విలానయే. ప్రబోధవలన నశించునది గనుక మిధ్యా. మెళుకువవచ్చిన తరువాత నిలుచునదే సత్యం ఇట్టి సత్యంపోనూ లేదు. స్వప్నస్థితి దృశ్యం నిజంగా లేనూలేదు. భ్రమ మాత్రమే గనుక ఇదంతయు స్వప్నములాంటిది ఇంద్రజాలం లాంటిది. అజ్ఞానముచే బద్ధుడునై తినను కొనుటకూడా భ్రమయే. ఆ అజ్ఞాన సంసారబంధము పోయినదనుకొనుటకూడా భ్రాంతియే. అందుచేతనే గౌడపాదాచార్యలవారుకూడా ''ననిరోధోనచో త్పత్తిః నబద్ధోనచసాధకః న ముముక్షుః నవైముక్తః ఇత్యేషా పరమార్ధతా'' యని పరమార్థదశయందు ఉత్పత్తినాశనములు అని గాని, బంధమును పొందినవాడనిగాని, ఆ బంధమునుండి విముక్తుడైనవాడనిగాని ఏమియు లేవనిరి, గనుక అజ్ఞానదశయందు మాత్రమే సర్వ వ్యవహారములుగాని జ్ఞానదశయందు ఏమియు లేవని శంకర భగవత్పాదులవారు స్వరూపావబోధో వికల్పా సహిష్ణుః స్తదేకో వశిష్టశ్శివః కేవలోహం అని సర్వ శృతిసారమయిన అమూల్యమైన పరమతత్వము నుపదేశించిరి. అయితే ఈ విషయములో అంతయు మిధ్యా అంటే మోక్షం కూడా, మిధ్యాయని అనుకొనకూడదు. బంధమే లేనపుడు బంధం పోయినదని అనుకొనుట కూడా మిధ్యాభూతమే. జీవుడు పరమాత్మ రూపుడయియే యున్నాడు గనుక నిత్యముక్తుడేకాని, మధ్య కాలంలో ఆగంతుక ముక్తుడు కాదని తాత్పర్యము. అందువలననే అవిద్యానివృత్యు పలక్షితచైతన్యం మోక్షః అంటారు. అనగా అజ్ఞాన నివృత్తి అయిన తరువాత మిగులు చైతన్యమే అనగా ఆత్మయే మోక్షమని యర్థము. అజ్ఞాన నివృత్తికూడా ఆరోపంకింద జమే. సచ్చిదానంద రూపమగు ఆత్మయే మోక్షముకదా. ఇట్టి ఆత్మ ఎప్పుడునూ వున్నదికదా, ఈ మోక్షంకొరకు ప్రయత్న మెందుకంటే అజ్ఞాన నివృత్యుపలక్షిత అనిరి. అజ్ఞాన నివృత్తి ఇప్పుడు లేదుకదా. అజ్ఞాన నివృత్తికి జ్ఞానమవసరమే. అజ్ఞాన నివృత్యుపలపక్షిత మనుటవలన అజ్ఞాన నివ్రృత్తికూడా బ్రహ్మకంటే వేరుకాదని యర్థము. బాగుగా లోతైన అద్వైత సిద్ధాన్తమును మాటిమాటికి శ్రవణమననాదులుచేసి గ్రహించవలయునని అందరు అతి శ్రద్ధతో గుర్తింపవలసిన విషయమని తాత్పర్యము. అవతరణిక. ఆత్మ సర్వకాలములయందు స్వప్రకాశ స్వరూపమే కదా. ఆ స్వప్రకాశ స్థితికి ఎప్పుడు లోపముండదుకదా. అయితే జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషు ప్త్యవస్థ యని భేదములు ఎట్లు కుదురును? భ్రాంతివలన యేర్పడినవా. అందామంటే మూడు అవసథలుకూడా భ్రాంతియే గనుక స్వప్నావస్థగానే వుండవలయును గాని ఈ తేడాలేమిటి? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ క్రింది శ్లోకమును చెప్పిరి. ఆరోప స్వరూపములు గనుక మూడు అవస్థలు సమానములైనను అజ్ఞానమనే అనాది దోష జన్యభ్రమావస్థ, జాగ్రదవస్థ యని ఆగంతుక నిద్రాదోష జన్యభ్రమావస్థ, స్వప్నావస్థ యని అజ్ఞాన కల్పిత భేదముచేతనే వ్యవస్థ కుదురును అని పరమార్థ స్థితిలో వ్యవస్థయే అవసరం లేదు. యే యవస్థలు లేనని చెప్పుచున్నారు. శ్లో|| నజాగ్రన్నమే స్వప్నకోవాసుషుప్తిర్న విశ్వోనవాతైజసః పాజ్ఞకోవా| అవిద్యాత్మకత్వాత్త్రయాణాంతురీయస్తదేకో೭ వశిష్ట శ్శివః కేవలో೭హం ||%ÁW|| ప్రతిపదార్థ నిరూపణము. మే=నాకు, జాగ్రత్=జాగ్రద్ధశ, న=నాస్తి, లేదు, స్వప్నకోవా= స్వప్నావస్థకూడా, న=లేదు, సుషుప్తిః=సుషుప్త్యవస్థ కూడా, న=లేదు, గనుక, అహం = నేను, విశ్వః=జాగ్రదవస్థాభిమానిని, అనగా వ్యష్టిస్థూల శరీరాభిమానిని, న = కాను, తై జసః = స్వప్నావస్థాభిమానిని, అనగా వ్యష్టి సూక్ష్మదేహాభిమానిని, న=కాను, ప్రాజ్ఞాకోవా=సుషువ్త్యవస్థాభిమానిని, న=కాను, ఎందువలననంటే, త్రయాణాం=జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థలతో కూడుకున్న విశ్వతైజస ప్రాజ్ఞులగు ముగ్గురికిని, అవిద్యాత్మకత్వాత్, అజ్ఞానకల్పిత స్వరూపములు కలవారగుట వలన విశ్వతైజస ప్రాజ్ఞులు ముగ్గురు సోపాదికులు గనుక దృశ్యరూపులై అజ్ఞాన కల్పిత స్వరూపులే గనుక పరమార్థ స్వరూపులుగారు. నేను కేవలః, ఉపాధిలేనివాడను. తురీయః. ఈ ముగ్గురుకంటే అతీతుడను, సాక్షిని, సచ్చిదానంద స్వరూపుడనని యర్థము. తాత్పర్య వివరణం. జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అను మూడు అవస్థలు అవిద్యాదశయందేగాని పరమార్థ దశయందు లేవు. అందువలననే ముగ్గురు అవిద్యాత్మకులు అని చెప్పిరి. కల్పితమైన ఉపాధితో కూడుకున్నవారే, గాని ఉపాధిరహితులుగా గోచరించుట లేదు. బాల్యమందు బాలుడని, పడుచుతనంలో యువకుడని, ముసలితనంలో వృద్ధుడని ఒకే వ్యక్తిని అన్నట్లు, ఒకే జీవుని జాగ్రద్దశయందు విశ్వుడని, స్వప్నదశయందు తైజసుడని, సుషు ప్తి దశయందు పాజ్ఞుడని శాస్త్ర సాంప్రదాయములో వాడుదురు, ఈ మూడు అవస్థలను, ఈ మూడు అవస్థలతో కూడిన విశ్వతైజస ప్రాజ్ఞాలనుతెలియచేయువాడు తురీయడని, సాక్షియని, అట్టి సాక్షి స్వరూపుడనే నేనని భగవత్పాదులవారు చెప్పినందువలన సర్వోపాధి రహితమై అగోచరమైన స్వప్రకాశమాన ఆనందరూపమే జీవునికి పరమార్థ స్వరూపమని బోధించిరి. పరమార్థదశయందు ఏద్వైతము లేదు. గనుక అవస్థాత్రయం లేదు. విశ్వతై జసప్రాజ్ఞులుకూడాలేరు. ఏ దృశ్యము లేదు, నిర్గుణ పరమాత్మయే యుండునని తాత్పర్యము. అవతరణిక. జాగ్రదవస్థ స్వప్నావస్థ సుషప్త్యవస్థలతో కూడిన ఆ యువస్థల యందు నేనునేను అని అభిమాము కలిగిన విశ్వతైజస ప్రాజ్ఞులు ముగ్గురు అజ్ఞాన సంబంధమువలన మిధ్యా స్వరూపం కలవారని అంటున్నారు కదా. అయితే ఈమూడు అవస్థలను ఈ అవస్థయందు అభిమానులైన ముగ్గురిని తెలియచేయు తెలుసుకున్నే (పరమాత్మకుకూడా) భాసకత్వము అనగా సాక్షిత్వము కూడా అజ్ఞానముచేత కల్పితమైనదని చెప్పవలెను గనుక ఈ ముగ్గిరివలె సాక్షికూడా మిధ్యాభూతుడనే చెప్పవలెను కదా యనే ప్రశ్నకు సమాధానముగా ఈశ్లోకమును చెప్పిరి. శ్లో|| అపివ్యాపకత్వాద్ధి తత్వప్రయోగా త్స్వతస్సిద్ధభావాదనన్యాశ్రయత్వాత్| జగత్తుచ్ఛమేతత్స మగ్రంతదన్యత్త దేకోవశిష్టశ్శివః కేవలో೭హం ||9|| ప్రతిపదార్థ నిరూపణము. తదన్యత్-తత్ = ఆ సాక్షికంటె, అన్యత్=వేరైన, ఏతత్=ఈ, సమస్తం=సమస్తమైన; జగత్=సాక్ష్యమగు ప్రపంచము; తుచ్ఛం=అనగా మిధ్యా అనగా జ్ఞానముచే నశించునది కాని సాక్షి అయిన ఆత్మ నశించేది కాదు. అధిష్ఠానము ఆరోపము నశించినను నశించదు గనుకను సర్వ ప్రపంచ నివృత్తికూడా సాక్షిలేనిది రుజువుకాదు గనుకను సర్వప్రపంచ నాశమునకు సాక్షియగు ఆత్మ నశించకుండా వుండునని యర్థము. అవి అన్నందువలన సాక్షి నాశమును తెలియచేయునది లేనందువలన కూడా సాక్షి నిత్యమని యర్థము. ఏదైతే ఆల్పమో అనగా పరిచ్ఛిన్నమో వ్యాపకముకాదో అది నశించేదియే. ఏది నశించునో అది అల్పము. ఆత్మకు అల్పత్వం, అనిత్యత్వము లేదని చెప్పుటకు వ్యాపకత్వాత్ అని చెప్పిరి. సర్వవ్యాపకమగుటవలన సర్వము బ్రహ్మస్వరూపమేనని శృతి చెప్పుచున్నది. గనుక బ్రహ్మ సర్వవ్యాపకము, సర్వాత్మకము అనగా సర్వప్రపంచంవలె కనిపించునది ఆత్మయే గాని వేరుకాదని యర్థము. అందువలన అత్మపరిచ్ఛిన్నము కాదు గనుక నిత్యమని యర్థము. అద్వైతులు ఆత్మయే మోక్షమంటారు కదా. మోక్షమంటే దుఃఖనాశ##మైనా కావాలి లేక సుఖరూపమైనా కావలెనుకదా ఆత్మ సర్వవ్యాపకమైనది, భావరూపమైనది. అందువలన అభావరూపమైన దుఃఖనాశస్వరూపంకాదు, సుఖం వస్తున్నట్లు పోతున్నట్లు అనుభవములో నున్నది గనుక ఆత్మ సుఖ స్వరూపం కూడా కాదు, గనుక ఆత్మపురుషార్థమనకూడదనే ప్రశ్నకు సమాధానం. హితత్వప్రయోగాత్ అని చెప్పిరి. హితత్వ = పురుషార్థత్వము యొక్క ప్రయోగాత్ ఉపేదశమువలన అనగా శృతులు ఆత్మ పుతృనికంటే ప్రియమైనదనియు, ధనముకంటే ప్రియమైనదనియు, అన్నిటికంటే లోపలిదనియు, వ్యాపకమనియు, ముఖమనియు, ఆనందమనియు, ఆత్మయేనని చెప్పుచున్నవి. నిత్యసుఖరూపము గనుక మోక్షము ఆత్మస్వరూపమనుటలో విరోధము లేదని భావము. ఆద్వైతులు ఆత్మ జ్ఞానస్వరూప మంటారు కాద. జ్ఞానమనగా ఒక క్రియయేకదా. లోకంలో నాకు జ్ఞానం కలిగినదిఅంటారు గాని నేను జ్ఞానస్వరూపుడనని ఎవ్వరు అనరు కదా. అద్వైతమతం ఎట్లా కుదురుననే ప్రశ్నకు సమాధానంగా అనన్యాశ్రయత్వాత్ అని చెప్పిరి. ఇతరమును ఆశ్రయించనిది గనుక సర్వమునకు అధిష్ఠానము గనుక దేనిని ఆశ్రయించిఉండేది. కాదు. జ్ఞానంక్రియ అయ్యేయెడల ఒక దానిని ఆశ్రయించి యుండును. ఆత్మ జ్ఞానరూపమే కాని క్రియారూపంకాదని యర్థము అందువలన నేను నిర్గుణమైన, ఆద్వితీయమైన, నిత్యమైన, సర్వసాక్షియైన ఆనందస్వరూపుడనని యర్థము. పంచదారను అనుభవించేవానికి సుఖంగాని పంచదారకు సుఖం లేదు కదా. అటులనే ఆనందము కంటే వేరుగానుండి ఆనందమును అనుభవించేవానికి తృప్తిగాని ఆనందస్వరూపమే అయితే అనుభవం ఎలాగని మాధ్వల ప్రశ్నకు సమాధానం, స్వతస్సిద్ధభావాత్ అని చెప్పిరి స్వప్రకాశ జ్ఞానస్వరూపమగుట వలన అని యర్థము. స్వప్రకాశానందం అనగా ఆనందం స్వరూపంగా భాసించుచునే యుండునని యర్థము, అట్టి అద్వితీయమైన, నిర్గుణమయిన సచ్చిదానంద స్వరూపుడనని యర్థం. తాత్పర్యవివరణం. ఆత్మసాక్షి, ఆత్మకంటే భిన్నమైన ప్రపంచమంతయు సాక్ష్యం. ఉపనిషత్తులు సాక్షికంటే భిన్నమైన సాక్ష్యము నశించునని చెప్పుచున్నవి. ఆత్మ అధిష్ఠానము గనుక, ప్రపంచము ఆరోపము గనుకను, ఆరోపము నశించినను. అధిష్ఠానము మిగులును. అసలు భ్రమ అనగానే అసలు వస్తువు తెలియలేదు. లేనివస్తువు తెలిసినదని యర్థము. ఆ అసలు వస్తువునే అధిష్ఠానమంటారు. తెలియలేదంటే అజ్ఞానంచేత ఆవరింపబడినదని యర్థము కదా, భ్రమఅంటేనే ఒక వస్తువు మరియొక వస్తువుగా కనిపించినదనే అర్థం కదా, అసలువస్తువు కనిపించక పోయినను లేకపోలేదు. లేనివస్తువు కనిపించినను సత్యం కాదు, లేదుకూడా, ఈ భ్రమవలన అసలు వస్తువుకు మార్పు ఏమాత్రం జరుగదుకదా, భ్రాంతిలో కనిపించిన లక్షణాలు అసలు వస్తువుకు అంటవుకదా, భ్రమఅంటేనే అసలు వస్తువును తెలుసుకుంటేనే ఆ భ్రమయు కనిపిచిన వస్తువు, నశించునని ఈ అనుభవమును బట్టి చెప్పక తప్పదుకదా. అసలు వస్తువు తెలిస్తే భ్రమపోతుందంటే అసలువస్తువు తెలియనందువలననే భ్రమవచ్చినదని అర్థం కదా. అందుచేతనే అంతయు అజ్ఞానముచేత కల్పింపబడినదని యందురు. అసలువస్తువు తెలియనపుడు పోలేదు తెలిసినపుడును పోదు. భ్రాంతి ఎప్పుడు అసలు వస్తువులేనిది కలుగదు కదా, అందుచేతనే అధిష్ఠానంలేని భ్రమకలుగదంటారు. అసలు వస్తువును తెలుసుకుంటే భ్రమపోవును. భ్రమలో గోచరించిన వస్తువుకూడా పోవునుగాని అసలువస్తువు పోదు కదా, శుక్తిని తెలుసుకుంటే రజతభ్రమ పోవుచున్నది. రజతంకూడా పోవును గాని శుక్తి పోవడంలేదుకదా, తాడును తెలుసుకుంటే సర్పభ్రమ పోవుచున్నది గాని తాడు పోవడంలేదు కదా, మెళుకువవస్తే కల పోవుచున్నది గాని కల కన్నవాడు పోవడం లేదుకదా. అసలువస్తువు ఆత్మయే భ్రమ వస్తువు ప్రపంచమే అసలు వస్తువైన ఆత్మను తెలుసుకుంటే జీవుడనే భ్రమ ప్రపంచం అనే భ్రమ జీవత్వం ప్రపంచము పోవునుగాని అధిష్ఠానమైన ఆత్మకూడా పోవునని శంకించకూడదు. మనం అట్టి అధిష్ఠాన స్వరూపులమేకదా, మాయావాదమును బాగా తెలుసుకుంటే ప్రశ్నపుట్టదు. సందేహముండదు ఇతర మతములయందు భ్రాంతి కలుగదు కూడా. షుమారుగా అద్వైత సిద్ధాంతమును తెలుసుకున్నను ఆశ్చర్యపడు ననుటలో సందేహంలేదు. అనేక ఉపనిషత్తులలో సర్వం బ్రహ్మ స్వరూపమేనని స్పష్టముగా నున్నది. పరిచ్ఛిన్నము నశించుననికూడాయున్నది ఆత్మ పరమప్రేమాస్పదమని, జ్ఞానరూపమని, ఆనందరూపమని చెప్పుచున్నవికదా పరమ ప్రమాణమైన శృతులు. కొందరు ఇట్లా ప్రశ్నచేస్తారు. మోక్షదశలో సుఖం అనగా బ్రహ్మనందం అనుభవంగా తెలియుచుండునా తెలియబడకుండా వుంటుందా, సుఖము ననుభవించడానికి శరీరము, ఇంద్రియములు, మనస్సయినా వుండవలెనుకదా, ఇవి ఏమీ లేకపోతే మోక్షదశలో సుఖానుభవం ఎట్లా కలుగుతుంది? మోక్షదశలో సుఖం తెలియబడదు అందామా, అంటే తెలియని సుఖమంటూ వుంటుందా.... అట్లు తెలియబడని సుఖంవుంటే నేమి లేకపోతేనేమి, ఇలాగే లోకానుభవమును బట్టి ఆలోచించండి, పటిక బెల్లం, పంచదార, తీపురస స్వరూపములు వాటిని తినేచేతనునికి తీపుగా బాగానున్నదని జ్ఞానం కలుగుచున్నది గనుక, ఆనందం కలుగును గాని, రసస్వరూపములయిన పంచదార, పటికిబెల్లములకు రసానుభవం ఆనందం కలుగడంలేదు కదా. ఆవిధంగానే పంచదారను తిన్నవానివలె భక్తులు నేరుగానుండి శ్రీమహావిష్ణువు, వైకుఁఠలోకాధిపతి, సర్వేశ్వరుడు అనంతకళ్యాణ గుణములుకలవాడు. ఆయన నాకు ఉపాస్యదేవత నేను ఉపాసకుడును భక్తుడను అని భావించుచు భగవత్సన్నిది యందున్న వానికి ఆ దివ్యవైభవమును చూచుచున్నవారికి ఆనందం కలుగునుగాని, ఆ బ్రహ్మలో ఏకమై పోయిన వానికి యేయానందం కలుగును? భగవంతుని అనుగ్రహం వలన సమస్త దుఃఖములను పోగొట్టుకొని హెచ్చుతగ్గులుగా ఆనందము ననుభవించుటయే మోక్షముగాని బ్రహ్మభావమే అనగా బ్రహ్మరూపముగా నుండుటయే ఆత్మరూపమే మోక్షమని చెప్పే అద్వైతమతం మంచిదికాదని మాధ్వలు మొదలగు ద్వైతులందురు, దానికి సమాధానముగా శంకర భగవత్పాదులవారు, స్వతస్సిద్ధ భావాత్ అని చెప్పిరి. స్వప్రకాశమానమైన జ్ఞానస్వరూమని యర్థము. ఆత్మ స్వప్రకాశానంద స్వరూపమైనది గనుక అందరికి స్వరూపమయియే యున్నాను. సంసార దశయందు ఆజ్ఞానము చేత ఆవరింపబడి యుండుటచేత పరమానంద స్వరూపము గోచరించదు. తత్వజ్ఞానముచేత అజ్ఞానము పోయినపుడు శరీరేంద్రియములు, మనస్సు లేకపోయినను పరమానందము స్వప్రకాశముగా ఆత్మరూపముగా భాసించుచుండును. సుషుప్త్యవస్థయందుశరీరము, ఇంద్రియములు, మనస్సు కూడా పనిచేయకపోయినను సుఖసాధనమగు విషయములు లేకపోయినను కూడా సుఖానుభవం ఉండుటలేదా. అందుచేత మోక్షదశయందు శరీరేంద్రీయాదులు లేకపోయినను ఇంతయని చెప్పుట కలవి గాని బ్రహ్మనందం అనుభవముగా ప్రకాశించుచునే యండును బ్రహ్మానందం సముద్రమువంటిది, విషయానందం ఆ సముద్రంలో (గాలికి) ఎగిరిన నీటితుంపురులాంటిది. అన్ని అవస్థలయందు అనుభవింపబడు అన్నిరకములయిన ఆనందములన్నియు బ్రహ్మనందము యొక్క ప్రతిబింబములే గాని వేరుకావు. అన్నిటికి బింబభూతమయినది. సముద్రములాంటి బ్రహ్మానందమే మోక్షదశయందు ఆత్మరూపముగా ప్రకాశించుచుండును. గనుక సంశయం అనవసరం, జ్ఞానంక్రియకదా, అట్టి జ్ఞానమనేక్రియ ఒకదానిని ఆశ్రయించుకొని యుండవలెనుకదా, అట్టి జ్ఞానస్వరూపము ఆత్మ ఎట్లగునని ప్రశ్న కూడా అనవసరం. ఆత్మ జ్ఞానస్వరూపమే. ఆ జ్ఞానం అంతఃకరణవృత్తుల యందు ప్రతిబింబించుచుండును. ప్రత్యక్షము, అనుమానము మొదలగు ప్రమాణములవలన అంతఃకరణవృత్తులు కలుగుచుండును. అంతఃకరణవృత్తులు అద్దములాంటివి. ఆ వృత్తులయందు ప్రతిబింబించే చైతన్యము అద్దంలో ప్రతిబింబించే ముఖములాంటిది. ఉత్పత్తి నాశములు అంతఃకరణవృత్తులకేగాని చైతన్యమునకులేవు. అద్దంలోనున్న నలుపురంగు మొదలైనవి అందులో ప్రతిబింబించిన ముఖమందు కనిపించినట్లు అంతఃకరణవృత్తికిగల ఉత్పత్తినాశములు ఆ వృత్తులయందు ప్రతిబింబించిన నిత్యసిద్ధమగు ఆత్మస్వరూపమయిన చైతన్యమందున్నట్లు వ్యవహరిస్తున్నారు. అందుచేత ఆత్మయే జ్ఞాన స్వరూపము, ఆనంద స్వరూపము, అపరోక్షరూపమని ఉపనిషత్తులు చెప్పుతత్వమును గ్రహించిన సందేహములు పుట్టవు. అంతఃకరణతో తాధాత్మ్యభ్రమవలననే అంతఃకరణవృత్తివేరు. చైతన్యంవేరు అని తెలియనందున అంతఃకరణవృత్తుల ధర్మములు ఆత్మయందున్నట్లు భాసించుచుండునుగాని వేరుకాదు. గనుకనే భగవత్పాదులవారు అనన్యాశ్రయత్వాత్ అని చెప్పిరి. స్వప్రకాశ##చైతన్యము, అధిష్ఠానము గనుక అధిష్ఠానమందే అన్నియు యుండునుగాని అధిష్ఠానం దేనిని ఆశ్రయించియుండనవసరంలేదు. అన్నియు ఆత్మయందే యుండును. ఆత్మస్వమహిమయందే యుండునుగాని ఇతరమును ఆశ్రయించియుండదు. ద్వైతమంతయు ఆరోపితం గనుక ఆత్మకంటే వేరులేదు. అందుచేత సత్యజ్ఞానానంద స్వరూపమైన ఆత్మ సత్యము. ద్వైతమంతయు మిధ్యాభూతమను సిద్ధాన్తమును అతిశ్రద్ధతో గ్రహించవలయును. అమూల్యమైన దురవగాహనమైన అద్వైతతత్వమును అతిశ్రద్ధతో సాక్షాత్కరించుకొని సచ్చి దానందరూపులుగా నుండవలయునని భావము. అవతరణిక. సర్వప్రపంచం తుచ్ఛమయ్యేయడల ఆ ప్రపంచమును నిషేధించుచు అధిష్ఠానమగు బ్రహ్మను బోధించుట కుదరదు. ప్రపంచమే లేక పోతే ప్రపంచమును నిషేధించుట కుదరదుకదా. వంధ్యాపుతృడు గగన కుసుమంలేవని నిషేధించుట పనికిరాదు. అవి అసలుంటేకదా నిషేధించడం. గనుక ప్రపంచమును నిషేధించడమేకుదరదు. అదియేకుదరకపోతే అధిష్ఠానమగు పరమాత్మను బోధచేయడమే కుదరదు. జగత్తును నిషేధించడమే కుదరకపోతే జగత్తుకు మిధ్యాత్వం ఎట్లాకుదురును? అనేప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకము చెప్పిరి. శ్లో|| నచైకంతదన్య ద్ద్వితీయం కుతస్యాన్నవా కేవలత్వం నచా కేవలత్వం| నశూన్యం నాచాశూన్య మద్వైత కత్వాత్కథం సర్వవేదా న్తసిద్ధం బ్రవీమి ||೧೦ || ప్రతిపదార్థ నిరూపణము. ఏకః=ఏకత్వవిశిష్టం; నచ=లేదు, కాదు; తదన్యత్=ఒకటికంటే భిన్నమైన ద్వితీయం రెండుమూడు అనునవి. కుతస్స్యాత్=ఎందువలన ఉండును. ఏకమేవ అని అద్వితీయమని శృతి ఏకత్వమును చెప్పుచున్నది. ఏకత్వముతో కూడుకున్నది లేదని ఎట్లాఅంటారుఅని ప్రశ్నిస్తే కేవలత్వం ఏకత్వం ఒకటి అనునది, నవా=లేదు; ఏకత్వముకూడా అజ్ఞానకల్పితమే గనుక ఏకత్వములేదని యర్థము. ఏకత్వం లేకపోయినను ప్రత్యక్షప్రమాణాదులవలన అనేకత్వ మెందుకుండకూడదని ప్రశ్నిస్తే చెప్పుచున్నారు. నచాకేవలత్వం-అకేవలత్వం, అనేకత్వం అనగా అనేకమను స్థితికూడా: నచ= లేదు; బ్రహ్మయందు నానా నాస్తిలేదని శృతి అనేకత్వమును నిషేధించుచున్నది గనుక అనేకత్వములేదని యర్థము. అయితే సర్వప్రపంచమును నిషేధి స్తే శూన్యమేకదా అంటే చెప్పుచున్నారు. నశూన్యం-శూన్యం= శూన్యము, న=లేదు; కాదు; తై త్తిరీయోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తుకూడా యెవరు బ్రహ్మ అసత్‌శూన్య మనుకుందురో, అనుకున్నవారు బ్రహ్మరూపులేకనుక వారే శూన్యమగుదురు అని సత్యమని జ్ఞానస్వరూపమని, అనంతమని, సృష్టికంటేపూర్వం సద్రూపమైన బ్రహ్మయే యున్నదని చెప్పుచున్నవిగనుక శూన్యమని చెప్పుటకు వీలులేదని యర్థము. అయితే సత్యత్వ జ్ఞానత్వ ధర్మములుకలది కావచ్చునుకదా అంటే చెప్పిరి; నచాశూన్యం-అశూన్యం=ధర్మములుకలది; న=కాదు; ఏకం అద్వితీయం అను రెండుపదములతో సర్వప్రపంచమును నిషేధించి ఏవ అనుపదముతో ధర్మధర్మిభావము నిషేదింపబడినది. ఎందువలనంటే అద్వైతకత్వాత్ అని చెప్పిరి, ద్వైతములేనిదిగనుక, ద్వైతమనగా నానావిధమైన ప్రపంచము. అద్వైతమనగా ప్రపంచము లేనిదనియర్థము. పరమాత్మ సర్వమునకు వ్యాపకము, ఆత్వస్వరూపము అయినపుడు ఇది ఆత్మయన్నపుడు ఇదియే ఆత్మయని చేతితోచూపించినట్లు చెప్పవచ్చును కదాయని ప్రశ్నచేస్తే సమాధానం : కథం సర్వవేదాంతసిద్ధం బ్రవీమి. అద్వైతముగనుక వాక్కుకుగోచరించని పరమాత్మతత్వమును ఎట్లాచెప్పెదను అనియర్థము. ఇట్టిఆత్మవిషయంలో వేదాంతములకు ప్రామాణ్యమెటులననగా సమాధానం, వేదా న్తసిద్ధం. ఉపనిషత్సిద్ధమనియర్థము. ఆత్మ గోచరించినిదైనను అఖండ బ్రహ్మాకారవృత్తిచేత అజ్ఞానము నశించునుగనుక, ఆరోపితమైన సర్వానర్థములు పూర్తిగా తొలగిపోవుచున్నవిగనుక పరమానంద స్వరూపుడై కృతకృత్యుడగునని యర్థము. తాత్పర్య వివరణం. అవాఙ్మానస గోచరమయిన సచ్చిదానందమగు పరమాత్మతత్వము. ఒకటియుకాదు, రెండూకాదు, ఇంతకంటే నానాకాదు. ఏమియులేదంటే శూన్యముకూడాకాదు. శూన్యముకాదంటే సగుణముకాదు. అద్వైతం అనగా ద్వైతంలేనిది. జాతిగుణక్రియలులేనిది. అందుచేతనే యేశబ్దములచేతను చెప్పుటకు వీలులేదు. చెప్పుటకు వీలులేనిది గనుకనే శిష్యుడు అడిగినపుడు గురువు మాట్లాడకుండా మౌనముగా తత్వమును బోధించెనని యున్నది. ఎవరయితే బ్రహ్మ నాకు తెలుసుననుకొందురో అట్టివారికి తెలియదు. ఎవరైతే నాకా బ్రహ్మ తెలియదనుకొందురో అట్టివారికే తెలుసునని ఉపవిషత్తులు చెప్పుచున్నవి. ముఖ్యవిషయం. ఆత్మ దృక్కు, దృక్కు అనగా తెలుసుకున్నేదే. ప్రపంచమంతా దృశ్యమే. అనగా తెలియబడేదే. ఆదృక్కు ఆత్మస్వరూపమే అదియే అన్నిటిని తెలుసుకొనుచున్నది, అట్టి దృక్కుచేతనే ప్రపంచమంతయు వున్నదని రుజువగుచున్నది. దృక్కు అను ఆత్మలేకపోతే ఏమియు తెలియదు. ఉన్నట్లు నిశ్చయంకాదు. అందువలననే ప్రపంచం పరప్రకాశ్యం. ఆత్మ స్వప్రకాశం అని వేదాంత సిద్ధాన్తము చెప్పుచున్నది. ఆత్మ దృక్కుగనుక దృశ్యముకాకపోతే దృశ్యంకాదని చెపుతుంటేకూడా దృశ్యమెందుకుకాదని అడగడమేమిటి. అట్టిఆత్మ తెలియబడినదంటే దృక్కును దృశ్యముగా గ్రహించిన వాడు భ్రాంతుడగునుగాని యదార్థమును తెలుసుకున్నవాడగునాః అన్నిటిని తెలుసుకున్నే ఆత్మ అనాత్మవలె కనిపిస్తుందా తెలియబడుతుందా, కనిపించకపోతే లేదనడానికివీలా అదిలేనిది ఇదిఏమి తెలియదుకదా. అట్టి ఆత్మ అందరకు అపరోక్షముగా అనుభవసిద్ధమేగాని పరోక్షముకాదుకదు. ఒకరహస్యం, ప్రమాణ ప్రమేయములు అన్నియు ఆత్మయందు కల్పితముగనుక. కల్పితమగు ప్రమాణములచేత పారమార్థికమగు ఆత్మ ఎట్లాతెలియచేయబడును. అందుచేతనే ఆరోపనిషేధపూర్వకముగానే అధిష్ఠానమును బోధించవలయునుగాని వేరుమార్గంలేదని చెప్పెదరు. అందు చేతనే వాచ్యవృత్తితో చెప్పుటకు వీలులేక లక్షణావృత్తితోనే వేదాంతములు బ్రహ్మతత్వమును బోధించుచున్నవి. నేత్రములతో అన్నిరూపములను చూస్తున్నాము అన్నిరూపములను చూపించే నేత్రేంద్రియం రూపములవలె కనిపించకపోయినను నేత్రేంద్రియం ఉన్నదనే చెప్పవలయును గాని లేదనిచెప్పుటకు వీలులేదుకదా, అటులనే శబ్దములు శ్రోత్రేంద్రియముతో వినబడుచున్నపుడు శబ్దములవలే శ్రోత్రేంద్రియం గోచరించనందువల్ల శ్రోత్రేంద్రియం లేదనవచ్చునాః రసనేంద్రియంతో అనేకరసములు అస్వాదింపబడుచున్నపుడు ఆ రసములవలె రసనేంద్రియం గోచరించలేదుగనుక రసనేంద్రియం లేదనవచ్చునా అటులనే అన్నిటిని తెలియచేయు ఆ చైతన్యరూపమైన ఆత్మ ఒకటియని నానాయని ఉన్నదని లేదని అన్నిటిని తెలుసుకొనుచున్నదికదా. ఇట్టి స్వప్రకాశ##మైన సర్వసాక్షిఅయిన సర్వులకు ఆత్మరూపమైన తత్వం, ప్రపంచం లేదంటే లేనిదగునా. శూన్యంకాదంటే సగుణమగునా. గునుక ఈ కల్పనలు ఏవియుకాదు. అనుభవమునకు దూరమైనది కాదు. ఇట్టి ఆత్మ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావము. నచ్చిదానంద స్వరూపమని తెలుసుకొని కృతకృత్యులగుదురుగాకయని పరమానుగ్రమహముతో ఈ దశశ్లోకిని ఉపదేశించిరి. ఈ దశశ్లోకియందు చాలా గొప్పప్రక్రియను సులభముగా చూపించిరి. ఆత్మను బోధించే ప్రక్రియ అతికష్టం. పూర్వజన్మలపుణ్యం లేనిది చెప్పుటగాని వినుటగాని సంభవించదు. గనుక ఆత్మబోధ అతిప్రయత్నంతో సాధించతగినదిగాని తేలికకాదు. ఈ పదిశ్లోకములలో పరమాత్మ స్వరూపమిదియని యెక్కడనో నున్నట్లు చెప్పకుండా తదోకో7వశిష్ట శ్శివః కేవలోహం అని చెప్పుచున్నారు. ఆ చెప్పుటలోకూడా ప్రతిశ్లోకంలో ముందు నాకారముతో ప్రారంభంచేసిరి. అనగా నిషేధంతో ప్రారంభించిరి. ఆరోపమేదియు కాదని చెప్పుచు అధిష్ఠానమగు పరమాత్మను నేనని బోధచేసిరి. ఆత్మను తెలుసుకొనతలచిన మానవుడు ఈ దశశ్లోకిలోచెప్పిన ప్రకారం అనాత్మయగు దేహేంద్రియాదులు నేనుకాను తత్సాక్షిస్వరూపమే నేనని తెలిసికొనుటకు ప్రతిశ్లోకమందు ఆత్మభావనను స్పష్టముగా చెప్పిరి. ఈ శ్లోకములలో చెప్పినప్రకారం అనాత్మ నిషేధంచేసి తదేకో7వశిష్ట శివః కేవలో7హ మని పరమాత్మ భావన చేసినయడల త్వరలోనే ఆత్మానుభూతి కలుగునని నా యభిప్రాయములు. మొదట శ్లోకంలో నేను భూమినికాను, భూమి నేనుకాదు. అని తాదాత్మ్యమును విడగొట్టుకొనవలెనని సూచించుచు భూమికాను, జలముకాను, తేజస్సుకాను, వాయువు కాను, ఆకాశముకాను, ఇంద్రియములుకాను, అన్నియు మార్పునుచెందుచున్నవిగనుక. జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలయందు నేను మార్పును పొందనివాడనుగనుక. అన్ని పోయినను మిగిలేవాడను. ధర్మములు లేని వాడను, సచ్చిదానంద స్వరూపుడను అద్వితీయుడనని ఆరోపమును నిషేధించుచునే అధిష్టానమగు పరమాత్మను చెప్పిరి. ఈ శ్లోకంలో చార్వాకాది నాస్తికమతములను తోసివేసినట్లును మామూలుగా అనాత్మనిషేధంచేసి సర్వాతీతమగు ఆత్మను తెలుసుకొని భావించవలసిన పద్ధతియు స్పష్టమైనది. రెండవశ్లోకమందు నాకు వర్ణాశ్రమములులేవు. వర్ణాశ్రమధర్మములు లేవు. ధారణాధ్యాన సమాధులులేవు. ఆత్మకు విరోధియైన-ఆత్మను ఆవరించిన ఆత్మయందారోపితమైన అజ్ఞానమువలన యేర్పడిన దేహాదులయందు గృహారామక్షేత్రాదులయందు నేను. నాదియనే అహంకార మమకారభ్రమను శివఃకేవలో7హం అనే ఆత్మసాక్షాత్కారముతో అజ్ఞానముతో సహా వదలిన తరువాత మిగిలేవాడను నేనే సచ్చిదానందస్వరూపుడనే యని, అనాత్మయే నశించునని, ఆత్మకు నాశం లేదని దృశ్యమును నిషేధించి దృక్కునేనని తెలుసుకొనవలయునని స్పష్టముగా తెలియుచున్నది. మూడవశ్లోకముందు నాకు తల్లియులేదు తండ్రియులేడు. వేదములులేవు, లోకములులేవు, దేవతలులేరు, యజ్ఞములులేవు, తీర్థములు లేవు, ఏమియులేవు. ఆత్మయే సత్యమని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. వళ్ళుమరచి గాఢనిద్రపొయ్యే సుషు ప్తవస్థయందు అన్నియు లయించిపోయినవి, అజ్ఞానమందే లయించినవి, ఆ యజ్ఞానమునకు సాక్షియేయున్నది. అదియే నేను. అది అనుభవనుద్దము. ప్రతినిత్యము అవస్థాత్రయమును అనుభవించుచున్నాముకదా? ఆ సాక్షిస్వరూపుడనే నేను. అద్వితీయుడను, నిర్గుణుడను, సచ్చిదానందస్వరూపుడనని, స్పష్టముగా తెలిసికొనవలెనని అజ్ఞానమువలన యేర్పడిన తల్లి తండ్రి మొదలగు సర్వభ్రమలను నిషేధించి పరమాత్మ స్వరూపమును నేనని భావించవలయునని చెప్పిరి కదా| నాల్గవశ్లోకమందు సాంఖ్యమతం కాదు, శైవమతంకాదు, పాంచరాత్రమతంకాదు జైనమతంకాదు, మీమాంసకమతంకాదు. మహావాక్యములవలన కలిగిన సచ్చిదానందరూపమగు పరమాత్మస్వరూపుడనే నేననియనుభవముతో చూచినయడల విశుద్ధస్వరూపుడనేగాని అనగా అద్వితీయమగు అన్నియుపోయినను, మారినను, మారకుండా, నశించకుండా సాక్షిగానుండు నిర్గుణమగు ఆనందబోధ స్వరూపుడనని అనాత్మనిషేధపూర్వకముగా ఆత్మభావన చేయవలసిన సిద్థాన్తమును చెప్పిరి గదా| అయిదవశ్లోకమందు పైనాకాదు, క్రిందాకాదు, లోపలాకాదు, బైటాకాదు, మధ్యముకాదు, అడ్డముకాదు, తూర్పుకాదు, పశ్చిమముకాదు, దక్షిణము కాదు, ఉత్తరముకాదు, ఆకాశముకంటే వ్యాపకస్వరూపుడనుగనుక పరిమితములన్నియు కల్పితములేగనుక కల్పితములు ఆత్మానుభూతితో నశించునుగనుక. అధిష్ఠానస్వరూపుడనగు నేనే అద్వితీయ నిర్గుణ స్వప్రకాశానంద స్వరూపడనుగా యుండునని దిక్కులు దేశము మొదలగు ఆరోపములను నిషేధిస్తూ అధిష్ఠానమును బోధించిరికదా| ఆరవశ్లోకమందు తెలుపుకాదు, నలుపుకాదు, యెరుపుకాదు, పచ్చదనంకాదు, కురచాకాదు, పొడవుకాదు, అణువుకాదు, మహత్తుకాదు, రూపంలేనిది. జ్యోతిస్వరూపము గనుకనే ప్రమేయముకాదుగనుకనే ప్రమేయధర్మములులేని అద్వితీయమగు నిర్గుణమగు అవశిష్టముగ ఆనందబోధ స్వరూపుడనేయని ఇంద్రియములకు గోచరించు స్వరూపములను సర్వపరిమాణములను నిషేధించుచు సర్వమునకు సాక్షిస్వరూపమగు సచ్చిదానందా ద్వితీయమగు పరమాత్మస్వరూపుడనే నేనని పరమాత్మాను సంధానమును బోధచేసిరి. యేడవశ్లోకమందు శాస్త్రమునుచెప్పు గురువు లేడు, శాస్త్రంలేదు. శిష్యుడులేడు, శిక్షలేదు. నీవులేవు, నేనులేను, ఈ ప్రపంచములేదు. స్వరూపానుభూతి కలిగినపిమ్మట యేసంశయములు కలుగవు. యేప్రశ్నలు కలుగవు, అన్నియు ఆత్మస్వరూపమేగనుక, అనుభవస్థితిలో యేశంకకు అవకాశంలేదు, అవస్థాత్రయం ఆత్మగానే భాసించునని శాస్త్రాదులను అన్నిటిని నిషేధిస్తూ అనుభవసిద్ధమగు ఆత్మనే బోధచేసిరి. ఎనిమిదవశ్లోకమందు నాకు జాగ్రద్దశ లేదు, స్వప్నదశ##లేదు సుషుప్తిదశ##లేదు అనగా అవస్థాత్రయములేదు. అందువలన విశ్వుడనుకాను, తైజసుడను కాను, ప్రాజ్ఞుడనుకాను, ఈ ముడు అవస్థలు అజ్ఞానకల్పితములు, విశ్వతైజసప్రాజ్ఞులుకూడా అజ్ఞానకల్పిత స్వరూపులే గనుక ఆత్మజ్ఞానముచేత అజ్ఞానం నశించగానే అవస్థాత్రయం నశించి విశ్వతైజస ప్రాజ్ఞులు కూడ అదృశ్యమగుదురు గనుక మిగులువాడను నేనే. అద్వితీయ నిర్గుణ సచ్చిదానంద స్వరూపుడనని అజ్ఞాన కల్పిత సర్వ ఆరోపరూపములను నిధిషేస్తూ అధిష్టానమగు అద్వితీయమగు సచ్చిదానంద స్వరూపుడనే నేను అని స్వరూపానుభవమును చెప్పిరి. సర్వవ్యాపకమైన వాడను గనుకను పుత్రమిత్ర కళత్రాదులకంటే ఆత్మయే పరప్రేమాస్పదం గనుకను యేదయితే దేశకాలవస్తు పరిచ్ఛేదరహితమో అల్పముకాదో అదియే అమృతం సత్యం అని శృతి చెప్పునది యనికూడా శృతిచెప్పుచున్నది. గనుక యేదైతే అల్పమో జన్యమో అనగా పుట్టునో అది నశించునది యనికూడా శృతిచెప్పుచున్నది. గనుక దృశ్యమగు అల్పమగు జన్యమగు-ఆరోపం నేనుకాను. నాయందే అన్నియున్నవికాని నేను దేనియందు లేను. వస్తుస్థితిలో నాకంటే వేరేమియులేదు గనుక అద్వితీయమగుటన్యమగు సచ్చిదానంద స్వరూపుడనని అల్పత్వమును నిషేధిస్తూ, స్వానుభవ సిద్ధమని స్వప్రకాశమని ఆనందరూపమని చెప్పుచూ అట్టి ఆత్మస్వరూపమే నేనని భావించమని బ్రహ్మానుభవమునుపొందు ప్రక్రియను భోధించిరి. పదవ శ్లోకమందు ఒకటియుకాదు రెండూకాదు ద్వితీయవస్తువు లేదు యేదీలేదు. అని చెప్పరి, ఈ చివర శ్లోకమును చాలా సావధానముగా విమర్శించవలయును, ఇట్లు విమర్శించుటలో చెప్పినవిషయమునే మరల అనువాదచేయుచు అనగా చెప్పుచు విశేషములను వ్రాయవలసియున్నది. నచైకం, తదన్యద్ద్వితీయం కుతస్స్యాన్నవా కేవలత్వం నచాకేవలత్వం అని చెప్పిరి. బ్రహ్మయందు అనగా ఏకత్వం అనే సంఖ్యలేదు. ఒకటి యనుటకు వీలులేదు. ఏకత్వమనే సంఖ్య లేకపోతే ద్విత్వం, త్రిత్వం అనగా రెండు, మూడు, అను సంఖ్యలు పరమాత్మకు అసలు లేవు. గనుక రెండు రూపములుగా నున్నది. మూడు రూపములుగా నున్నదియని అనుటకు వీలులేదు. ప్రతిపదారమందు ఒక ధర్మముంటుంది. అనగా గోవుయందు గోత్వమనే ధర్మముండును, మనుష్యునియందు మనుష్యత్వమనే ధర్మముండును. గోవుకు గోత్వమనే ధర్మమునకు, మనుష్యునకు మనుష్యత్వమనే ధర్మమునకును, ఒక సంబంధం కూడా ఉండును. అన్ని పదార్థములకును జాతిగాని, గుణముగాని, క్రియగాని, పేరుగాని వుంటవి. బ్రహ్మయందు బ్రహ్మత్వం ఆను ధర్మముండవలయయును కదా, పరమాత్మయందే పరమాత్మత్వం అనే ధర్మముండవలయునుకదా, అటులనే ఏకమంటే ఏకత్వముండవలెను కదా, అనేకమంటే అనేకత్వముండవలెను కదా, యే ధర్మంలేదనిది పరమాత్మయని ఎట్లా విశ్వసింపచవలెను. అంటే శృతిచెప్పుచున్నది యేమంటే నిర్గుణమని నష్ర్కియమని శాంతమని దోషము లేనిదని నామరూపాదులు లేనిదని అనేక వుపనిషత్తులయందు ఈ విధంగా చెప్పబడి యున్నది. అందువలన పరమాత్మకు ఏ ధర్మముల లేవని చెప్పవలసినదే. పైనచేసిన ప్రశ్నకు సమాధాన మేమంటే బ్రహ్మయందు బ్రహ్మత్వముండదాయంటే బ్రహ్మయనగా అపరిచ్ఛిన్నం అనగా వ్యాపకం అని యర్థము. అనగా దేశకాలవస్తు పరిచ్ఛేదము లేనిదని యర్థము, బ్రహ్మత్వమనగా కూడా పరిచ్ఛేదా భావమనియే అర్థము. అనగా అల్పత్వం లేదని తాత్పర్యము. ఆత్మయన్నను అనాత్మ కాదనియే అర్థముగాని ఆత్మత్వమనే ధర్మము కలదని యర్థముకాదు. జన్యమంటే నాశము లేనిదని యర్థము. జ్ఞానమనగా స్వప్రకాశమని స్వప్రకాశమనగా పరప్రకాశ్యము కాదని యర్థము. గనుక అన్ని పదములు పరమాత్మను మరియొక ధర్మము, గుణము, జాతి-క్రియ-నామము లేవని చెప్పుచునే బోధించుచున్నవిగాని ధర్మాదులు పరమాత్మ కున్నవని బోధించుట లేదు. గనుకనే పరమాత్మను ఉపనిషత్తులు ఆరోపమును నిషేధిస్తూ బోధించుచున్నవని లక్షణావృత్తితో బోధించుచున్నవని సంప్రదాయమును తెలిసిన పెద్దలు చెప్పెదరు. యే ధర్మములు లేవని బోధించుటచేతనే పరమాత్మ వేదాన్త వాక్యములకు లక్ష్యార్థమని చెప్పెదరు. శంకర భగవత్పాదులవారు వారు వ్రాసిన భాష్యములయందును వేదాన్త స్తోత్రములయందుకూడా అద్వైత తత్వమును అనుభవంలోనికి తెచ్చుకున్నే పద్ధతిని బాగుగా బోధించిరి. ఈ దశశ్లోకియందు అన్నిటి కంటే చాలా గొప్పగా చెప్పిరి. అందులోకూడా ఈ శ్లోకంలో ఒకటి కాదని ఒకటి కాకపోతే అనేకం కాదని ధర్మములు లేవని చెప్పిరి. నవాకేవలత్వం నచా కేవలత్వం అని కూడా చెప్పిరి. అనగా ఏకత్వం లేదు. అనేకత్వంకూడా లేదనేయర్థము. యేమీలేదంటే శూన్యమనుకొన వద్దంటున్నారు. శూన్యం కాదంటే ధర్మములతో కూడుకున్నది కూడా కాదు. ''నశూన్యం నచా శూన్యమద్వైతకత్వాత్కథం సర్వేవేదాన్త సిద్ధం బ్రవీమి'' అని చెప్పిరి. ఏదీకాదని చెప్పుటలో అద్వైతకత్వాత్ అని హేతువును చెప్పిరి. అద్వైతమనగా ద్వైతంలేనిదని యర్థము. అనగా రెండవది లేనిదని యర్థము. గోవుయందు గోత్వమున్నట్లు మనుష్యునియందు మనుష్యత్వమున్నట్లు పరమాత్మయందు పరమాత్మత్వమున్నయడల పరమాత్మకంటె పరమాత్మత్వ మను ధర్మం వేరనియే చెప్పవలయును గనుక ఆ ధర్మము పరమాత్మత్వమనే ధర్మము. ద్వైతమే గనుక ఆ ధర్మమున్న యడల పరమాత్మ అద్వైతం కాదు. అటులనే, పేరున్నను అదిత్వైతమే గనుక పరమాత్మ అద్వైతం కాదు. అటులనే జాతియున్నను, గుణమున్నను. క్రియయున్నను అవి ద్వైతమే గనుక పరమాత్మ అద్వైతము కాదని చెప్పవలసి వచ్చును, గనుకనే పరమాత్మకు, నామ, రూప, జాతి, గుణక్రియలు యేమాత్రంకూడా లేవని చెప్పవలయును. శృతికూడా ఆత్మ సాక్షి గనుకనే కేవలమని అనగా అద్వైతమని అందుచేతనే నిర్గుణమనియు చెప్పెను. సాక్షి యనగా తెలియచేయునదే గనుక తెలియబడే ధర్మములు తెలియచేయు ఆత్మ కేమాత్రము అంటవు గనుక ఏకత్వము, నానాత్వము, జాతి, గుణక్రియ, నామాదులు, ఇతర ధర్మములు, సంబంధములు ఉన్నదనునది, లేదనునది అన్నియు తెలియబడునవే గనుక యిన్నిటిని తెలియజేయు సాక్షియైన పరమాత్మకు ఇవి యేవియు లేవని బాగుగా అనుభవంలోకి తెచ్చుకొనవలసిన విషయం, అద్వైతకత్వాత్ అని హేతువును చెప్పి ద్వితీయ వస్తువులేనిది గనుక అద్వైత స్వరూపుడనని యర్థము. సాక్షిని గనుక అనగా చిద్రూపుడను గనుక సర్వధర్మ రహితుడనని సర్వదామననం చేసి తెలిసికొనవలసిన విషయం, అందువలననే కథం సర్వవేదాన్త సిద్ధం బ్రవీమి యని చిట్టచివరలో చెప్పిరి. వాక్కుకును ఇంద్రియములకును గోచరముకాదు గనుక అత్మస్వరూపమే గనుక శంకర భగవత్పాదులవారు యెట్లా చెప్పవలయును అనిరి. ఆత్మ భిన్నమును చెప్పవచ్చును వినవచ్చును తెలుసుకొనవచ్చును గాని ఆత్మను చెప్పడంకుదరదు. వినడం కుదరదు. తెలుసుకొనడం కూడా కుదరదు. చెప్పేవారికి ఆత్మస్వరూపమే గనుక చెప్పలేడు. వినేవానికి కూడా ఆత్మస్వరూపమే గనుక వినలేడు, తెలుసుకున్నేవారికి కూడా ఆత్మస్వరూపమే గనుక ఆత్మ భిన్నమును తెలునుకొనవచ్చును గాని లుసుకొను ఆత్మను తెలుసుకొనుట కుదరదు. అద్వైత బోధ చాలా గహనము గనుక సాక్షాత్తు ఈశ్వరావతారమైన శంకర భగవత్పాదులవారు కూడా ఈ దశశ్లోకిలో నభూమిర్నతోయం అని మొదలుబెట్టి సర్వశృతుల సారమును తెలియచేయునటుల తదేకో7వశిష్టశ్శివః కేవలో7హం అని ప్రతిశ్లోకమందు ఆత్మస్వరూపమును నేనే నని పూర్తిచేయుచు చివరశ్లోకమందు కథం సర్వవేదాన్త సిద్ధం బ్రవీమి అని చెప్పిరికదా. ప్రతిశ్లోకమందు శివః కేవలో7హం ఆని చెప్పిరి. సర్వవేదాన్త సిద్ధమైన నా స్వరూపమైన పరమాత్మను నేనెట్లు చెప్పగలనని స్పష్టముగా చెప్పిరి. ఆత్మ గనుకనే చెప్పజాలను అందుచేతనే యేదీకాదు, నేను అద్వితీయ సచ్చిదానంద స్వరూపుడ నంటున్నాను. ఇది పరమాత్మయని చెప్పలేము గనుక తత్వమును తెలసికొనతలచిన ముముక్షువులందరును దృశ్యమగు భూత భౌతికములను నిషేధించి సర్వనిషేధములకు అవధియైన అనగా అన్నిటిని నిషేదించగా మిగిలిన స్వరూపమునే అనగా దృశ్యములను నిషేధిస్తే మిగులువాడు ద్రష్టయే గనుక అనగా అన్నిదృశ్యములను నిషేధింపగా జీవునకు ఉపాధి భూతమగు అంతఃకరణ మొదలగునవి కూడా నిషేధింపబడినపుడు సర్వోపాధిరహితమగు నిర్గుణసచ్చిదానందస్వరూపమే మిగులును. అదియే నేనని తెలుసుకొనవలెనని శివఃకేవలో7హం అని చెప్పుచు ఆత్మను అద్భుతంగా బోధించిరి. ఆత్మ అవాజ్మానసగోచరమనే విషయం దక్షిణామూర్తిస్తోత్ర తాత్పర్యవివరణయందు విస్తారముగా వ్రాసితిని. ఈ శ్లోకములో ప్రసంగవశముగా కొంతప్రతిపాదించితిని. యెన్నిపర్యాయములైనను వ్రాయవలసిన విషయమేకాని వదలివేయవలసిన విషయంకాదు. కేవలం జ్ఞానకాండ గనుక ఇతరవిషయములేనియు అనగా ఇతిహాసాదులను వ్రాయకూడదు. శాస్త్రార్థమును సులభముగా తెలియునటుల వ్రాయులయును. మూలశ్లోకములు సులుభముగా నుండునట్లు పైకిగోచరించునుగాని చాలా గంభీరమగు అర్థమున్నది. సులభముగా మామూలుఆర్థమును గ్రహించి విశేషముగా విచారించవలయును గనుకనే మధుసూదన సరస్వతీస్వాములవారు ఈ పదిశ్లోకములకు సిద్ధాన్తబిందువని వ్యాఖ్యానం వ్రాసిరి. దానికి గౌడబ్రహ్మానందులవారు వ్యాఖ్యానంవ్రాసిరి. ఆవ్యాఖ్యానములు చాలా కఠినమైన శాస్త్రచర్చలతో కూడుకొనియున్నవి. అట్టి వ్యాఖ్యానములు ఈ శ్లోకములకు వ్రాయబడినవంటే ఈ శ్లోకమునకు గంభీరార్థ మెంతయున్నదో గ్రహించవచ్చును. గనుక ఈ పదిశ్లోకములను ముందు నోటికివచ్చేలాగున చదువవలయును. తరువాత ప్రతిపదార్థమును చదువవలయును. తరువాత తాత్పర్యవివరణమును చదువవలయును, పదోశ్లోకంక్రింద చివరవ్రాసిన వివరణకూడా చదువవలయును అన్ని శ్లోకముల అర్థమును చివరలో అనువాదంచేసితిని. అనువాదం తరువాత కొంత సారాంశను కూడా వ్రాసితిని గనుక బాగుగాచూచి గ్రహించవలసినది. ఈ దశశ్లోకియని చెప్పుట అతిశయోక్తికాదు, అహంకారం కాదని సజ్జనులు గ్రహించగలరు, అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానా త్తదేకో వశిష్టశివః కేవలో7హం అని చెప్పరి. ఆత్మ నావరించిన మూలాజ్ఞానమే అహంకారమునకు మమకారమునకుకూడా కారణం. అట్టి అహంకార మమకారములే జీవునికి చాలాబంధమునకు కారణములు. ఆత్మయందు కల్పితమైన కొన్ని పదార్థములయందు మమకారము, కొన్నిపదార్థములయందు అహంకారము కలుగుచున్నట్లు అనుభవంలోనున్న విషయమే. పాంచబౌతికమగు శరీరమందు ఇంద్రియములయందు నేనని అహంకారభ్రమయున్నది. యిల్లు, వాకిలి, భూములు, ధనం, భార్యపుతృలు పుత్రికలు మొదలగు కొన్నిటియందు నావియనే మమకార్యభ్రమ అజ్ఞులకందరికిని కలుగుచునేయున్నది కదా ఈ యహంకార మమకారభ్రమలు సర్వజనులకును ప్రత్యక్షముగా నున్నను విడిచిపెట్టుట శక్యమగుటలేదు. వీటిమూలాననే కర్మలుచేయుట అందువలన అందువలన జన్మమరణపరంపలు కలుగుచున్నవని తెలిసినవిషయమే, ఇట్టి ఆత్మకంటే భిన్నమైన భౌతిక ములయందు అనాదిగా అజ్ఞానమువలన ఏర్పడిన అహంకార మమకారములను పోగొట్టుకొన్నయడల జీవునికి పరమానందస్థితి కలుగునుగాని ఈ యహంకార మమకారము ఎట్లాపోవలెనని విచారించవలయును. అజ్ఞానంవలననే యేర్పడినవని శాస్త్రం చెప్పుచున్నదికదా| ఈ యజ్ఞానమును పోగొట్టునది ఆత్మజ్ఞానమేననిగూడా శాస్త్రమే చెపుచున్నదికదా! ఈ శాస్త్రమును అర్థంచేసుకున్నేవారు యేజీవులనగా పశుపక్షి మృగాదులు కావుకదా| వాటికి సామర్థ్యములేదు. ఒక మనుష్యజీవులకే శాస్త్రమును అర్థంచేసుకొని తరణోపాయమును తెలిసికొని ఆచరించి తరించే సామార్థ్యంకలదు. ఇతరజీవరాసులకా శక్తిలేదని అందరికిని తెలిసినవిషయమే కదా| ఈ దశశ్లోకియందు ప్రతిశ్లోకంలోకూడా ఆత్మకు ఆరోపసంబంధం లేకపోవుటతో సచ్చిదానందస్వరూపమే పారమార్థికమని చెప్పుటలోను ఒక హేతువును పంచమావిభక్తితోకూడిన ఒకపదంతో చెప్పిరి. అది ముఖ్యముగా గమించవలసిన విషయం. మనస్సుకు ప్రపంచమునకు యల్లప్పుడు సంబంధమున్నదని గమనించవలయును. ఆ మనస్సుయొక్క ప్రవృత్తి నివృత్తులనుబట్టియే జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ, ఈ మూడవస్థలు యేర్పడినవి. ప్రతిమానవుడు ఈ మూడుఅవస్థలలోనే ఆత్మానాత్మవిచారం చేయవలయును. అంటే సుషుప్త్యవస్థయందు స్వప్నావస్థయందు ఆత్మానాత్మవిచారంచేయవలయునని అర్థంకాదు. జాగ్రదవస్థ యందు జ్ఞాతయగు జీవుడెట్లున్నాడు. జ్ఞానమెట్లు కలుగుచున్నది. జ్ఞేయము లెట్లున్నవని విచారించవలయును. అంటే జ్ఞాతయగుజీవుడు జీవునికి ఉపాధియగు మనస్సు బహిర్ముఖమై యుంటవి గనుకనే జాగ్రదవస్థయందు ఒకరకమైన సంస్కారము వలన ఆధిష్ఠానమగు పరమాత్మయే జాగ్రత్ర్పపంచమువలె బాహ్యవిషయములను గ్రహించుజ్ఞానమువలె ఇట్టిజ్ఞానంకల జ్ఞాతవలె కనిపించుచున్నది. అయితే ఈ జాగ్రదవస్థయందు కనిపించే శబ్దస్పర్శాదులు మారుచున్నవి. శబ్దస్పర్శాదులుగా పరిణమించిన అంతఃకరణవృత్తులు మారుచున్నవి. అనగా జ్ఞానములు మారుచున్నవికాని తెలుసుకున్నే ఆత్మ మారుటలేదు. దీనినిబట్టి జ్ఞేయంకంటే, జ్ఞానంకంటేకూడా జ్ఞాత వేరుగానున్నాడు. ఈ విషయంలో హేతువేమనగా జ్ఞేయము, జ్ఞానము మారుచున్నవి. గనుకను జ్ఞాత మారుటలేదుగనుకను, మొదటి శ్లోకంలో ''అనైకాంతికత్వాత్'' అని చెప్పిరి. స్వప్నావస్థయందు బాహ్యప్రపంచం కనిపించకపోయినను శరీరంలోపల హృదయపుండరీకంలోనే మనుస్సు బహుసంస్కారములతో సంచలనమును పొందును. అనేకవిధములగా పరిణామమును పొందును, ఆ పరిణామమే స్వప్నావస్థయందు కనిపించే ప్రపంచమని వ్రాసియున్నాను. ఆ సమయమందు కూడా స్వప్నమునుచూచే ద్రష్ట. స్వప్నమందుకనిపించే అన్నదృశ్యములను చూచుచున్నాడు. స్వప్నమందును దృశ్యములు మారుచున్నవి. అవమయమందు కలిగిన అంతఃకరణవృత్తులనే జ్ఞానములు కూడా మారుచున్నవి. జ్ఞాతమాత్రం మారుటలేదని చెప్పవచ్చును. దీనిని బట్టి మార్పునుచెందే స్వప్నమందలి విషయములకంటే అప్పటిజ్ఞానముల కంటే కూడా మార్పుచెందని జ్ఞాత వేరేనున్నాడుకదా! అనైకాంతికత్వాత్ అని స్పష్టముగా చెప్పిరి. సుషుప్త్యవస్థయందు బాహ్యప్రపంచంలేదు. స్వప్నమందుకనిపంచే లోపలిప్రపంచములేదు కనిపించుటలేదు. దృశ్యమగు విషయములే లేక పోయినపుడు దృష్టియను జ్ఞానములుకూడా లయించిపోయిని. ద్రష్టకు కూడా విశేషస్వరూపములు పోయినవి, దృశ్యములు పోయినవిగాని ద్రష్టస్వరూపం పోలేదని గమనించవలయునుకదా! అందువలననే సుషుపై#్త్యకసిద్ధస్త దేకో7వశిష్ట శ్శివః కేవలో7హం అని చెప్పిరి. సుషుప్త్యవస్థ యందు ప్రమాణప్రమేయ వ్యవహారములు లయించినను అన్నిటిని తెలుసుకున్నే సాక్షిమాత్రం లోపించుటలేదుగనుకనే సాక్షి స్వప్రకాశ స్వరూపుడని చెప్పుచున్నారు. గనుక అట్టి సాక్షియగు పరమాత్మ స్వరూపం సర్వావస్థలయందును భాసించుచునేయుండును, గనుక నిత్యప్రకాశ రూపమని వేదాస్తులు చెప్పెదరుగనుక బాగుగా ప్రతిశ్లోకమును విమర్శించవలయును, విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్ అని చెప్పిరి. విశిష్ఠానుభూతి యనగా మహావాక్యములవలన కలుగు సర్వధర్మరహితమైన యే విశేషములులేని పరబ్రహ్మనుభవమేనని ప్రతిపదార్థనిరూపణలో వ్రాసియేయుంటిని నేను అనే ఆత్మానుభవము, జాగ్రవస్థయందు ఒకవిధముగాను, స్వప్నావస్థయందు మరియొకవిధముగాను సుషుప్త్యవస్థయందు మరియొకవిధమగా నుండును. అందువలననే విశ్వతైజస ప్రాజ్ఞులని మూడుఅవస్థలలోనున్న జీవునికి పేరుపెట్టిరి. ఆ బేధము ఉపాధివలన యేర్పడినదిగాని నిరుపాధిక స్వరూపమునకు యెంతమాత్రంకూడా భేదములేదు. అట్టి ఒక నిర్వికార స్వరూపము త్రిపుటివర్గములలోను అవస్థాత్రయములలోనే నేను నేననే అభిమానం కలిగిన చిదాభాసునికంటే అనగా జీవునికంటే పరమాత్మ స్వరూపం వేరేనున్నదని అదియె జీవునికి పరమార్థమని అదియే అన్ని శ్లోకములయందును తదేకో7వశిష్టశ్శివః కేవలో7హం అని చెప్పబడినదని దానినే నేను, ఇదికాదు, ఇదికాదని సర్వమును నిషేధించుచు తెలుసుకొనవలయునని చెప్పినట్లు గ్రహించవలయును, వియద్వ్యాపకత్వాద ఖండైక రూపస్తదేకో వశిష్టశ్శివః కేవలో7హం అని చెప్పిరి. ఆకాశంకంటె వ్యాపకమని చెప్పిరి. అఖండ స్వరూపమనికూడ చెప్పిరి. ఆకాశంకంటే పరమాత్మ వ్యాపకమెట్లగును అని విచారించవలయును. అధిష్ఠానం గనుక సర్వత్రనిండియున్నది. గనుక వ్యాపకము ప్రతియారోపమందును సద్రూపముచేతను, చిద్రూపముచేతనూ అను గతమై భాసించుచున్నది. గనుక సర్వవ్యాపకమని చెప్పవలయును. అందువలననే ఆ అఖండరూపము సర్వాధిష్ఠానమగు పరమాత్మరూపమునకు ఖండంలేదుగనుక ఆఖండం, పరిపూర్ణమని యర్థము, అట్టి వ్యాపకమగు అఖండస్వరూపమే మనమని తెలుసుకొనవలయును. స్వరూపాతిబోధో వికల్పాసహిష్ణుః అనుటవలన అట్టి స్వరూపబోధ కలిగినపుడు సంశయము కలుగదు అని వ్రాసిన విషయమే. పరోక్షముగా అట్టి స్వరూపమును తెలిసికొన్నను చాలా సంశయములు పోవును. పాపములు నశించును, దుస్సంస్కారములు నశించును, ప్రమాతయందున్న అసత్వావరణమను ఆజ్ఞానంకూడా నశించును. అనగా పరోక్షజ్ఞానం కలుగక ముందు ఆత్మతత్వమిదియని తెలియదుగనుక అట్టి అజ్ఞానం పరోక్షజ్ఞానం కలిగినతరువాత నశించును. ప్రతిచోటను పరోక్షజ్ఞానమువలనకూడా, అసత్వావరణ నశించునని చెప్పవచ్చును. ఈ విషయం ఈ పుస్తకంలో కొన్నిచోట్ల వ్రాసియుంటిని, స్పష్టముగా తెలియుటకు మరల వ్రాసితిని. ఆభానావరణమాత్రం అనగా బ్రహ్మను ఆవరించిన అజ్ఞానము ఆపరోక్ష జ్ఞానముచేతనే నశించును గనుక. అట్టి అపరోక్ష జ్ఞానము ఈదశ శ్లోకియందు ప్రతిశ్లోకంలో చివరలో చెప్పబడిన అద్వితీయమగు అన్నియు పోయునను మిగిలిన ఆఖండ స్వప్రకాశానంద స్వరూపమే. అదియే పరమమంగళ స్వరూపం, అట్టి స్వరూపసాక్షాత్కారమునే. అఖండ బ్రహ్మాకారవృత్తియందురు. దీనివలననే మూలాజ్ఞానం పోవును. అవి పోయిన సకలభ్రమలుకూడా పోవును. అపుడు అవశిష్టమగు సచ్చిదానంద స్వరూపుడుగా నుండవచ్చును. అదియే ముక్తియని యల్లప్పుడును స్మరించవలసిన విషయం మరువకూడదు. అనుభవంలోకి తెచ్చుకొనవలయును. దశశ్లోకి సమాప్తము. ఇట్లు శంకరభగవత్పాదులవారు వ్రాసిన దశశ్లోకికి మద్దుపల్లి మాణిక్యశాస్త్రిచే రచింపబడిన తత్వరహస్యప్రభ యను తెలుగు టీకా తాత్పార్య వివరణం సమాప్తం.